భార్యపై అనుమానం… కరోనా మందు పేరుతో ఏం చేశాడంటే..!

కరోనా వైరస్ అతడికి కలిసొచ్చింది. భార్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి కరోనాను అడ్డంపెట్టుకొని పెద్ద స్కెచ్చే గీశాడు. కానీ చివర్లో అది కాస్తా బట్టబయలవడంతో ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. ఢిల్లీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

అలీపుర్‌కు చెందిన ప్రదీప్(42) తన భార్యకు ఒక హోం గార్డుతో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. గత కొన్ని రోజులుగా ఈ అనుమానం మరింతగా పెరిగి.. చివరకు భార్యపై తీవ్ర కోపాన్ని పెంచుకున్నాడు. దీనికి ప్రతీకారంగా సదరు హోం గార్డును ఫ్యామిలీతో సహా అంతం చేయాలని భావించాడు. దీనికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాడు.

కరోనా వైరస్ నివారణ మందు పేరుతో ఆ కుటుంబానికి విషం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు మహిళలను ఆరోగ్య కార్యకర్తల రూపంలో రంగంలోకి దించాడు. సదరు హోం గార్డు ఇంటికి వెళ్లిన ఈ మహిళలు.. కరోనా మందు పేరుతో ఇంట్లోని ముగ్గురితో విషాన్ని తాగించారు. దీంతో వెంటనే అస్వస్థతకు గురవడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమేరాలు పరిశీలించగా ఇద్దరు మహిళలు కరోనా మందు పేరుతో వచ్చినట్లు గుర్తించారు. వారిని గాలించి పట్టుకొని విచారించగా.. ప్రదీప్ తమతో డబ్బిచ్చి ఈ పని చేయించినట్లు ఒప్పుకున్నారు. వెంటనే ప్రదీప్‌ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తన భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకే హోం గార్డు కుటుంబాన్ని అంతం చేయాలని చూసినట్లు అతను విచారణలో ఒప్పుకున్నాడు.