తీర్పులు అరగంట ముందే చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి?- వైసీపీ ఎంపీ సురేష్

సుధాకర్ అనే వ్యక్తి సైకో అన్నది అతడి మాటలను బట్టే అర్థమవుతోందన్నారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సురేష్… సీబీఐ విచారణ జరుపుకుంటే తమకేం అభ్యంతరం లేదన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. హైకోర్టులో వచ్చే తీర్పులు అరగంట ముందే చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయని… దీనిపై విచారణ జరిపించాలన్నారు.

చంద్రబాబు కాల్ లిస్ట్‌ బయటపెట్టాలన్నారు. చంద్రబాబుకు రాబోయే తీర్పులు ముందే ఎలా తెలుస్తున్నాయని సురేష్ ప్రశ్నించారు. దీన్ని బట్టే చంద్రబాబు ఏస్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. సుధాకర్ ఎపిసోడ్‌లో కుట్ర కోణం తప్పకుండా ఉందన్నారు. సుధాకర్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా కాకుండా కావాల్సిన విధంగా ఎడిట్ చేసి ప్రచారం చేశారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవహేళన చేసిన చంద్రబాబు… ఇప్పుడు రాజకీయంగా తాను బతకడానికి దళితులను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు.

సైకోలాగా మతాలను, ప్రధానిని, ముఖ్యమంత్రిని తిట్టిన సుధాకర్‌కు వీరంతా మద్దతుగా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే స్టే తెచ్చారని… పేద పిల్లలు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని ఇంగ్లీష్ మీడియం తెస్తే దానిపైనా స్టే తెచ్చారని విమర్శించారు. సుధాకర్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు ఎల్లో కలర్ రంగులు వేస్తే… దానిపై పిటిషన్ వేస్తే అధికారంలో ఉన్న పార్టీ కదా వారి రంగు వేసుకుంటే తప్పేంటని హైకోర్టు తీర్పు చెప్పిందని సురేష్ గుర్తు చేశారు. ఇప్పుడు మట్టి రంగు వేసినా దాన్ని కూడా వైసీపీకి ఆపాదిస్తున్నారని … అన్ని రంగులు వైసీపీవే అన్నట్టుగా అంటకడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకునే ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు అనుభవం మొత్తం మోసాలు చేయడానికి వాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైపు ప్రజలు లేరని… అందుకే చంద్రబాబు బతుకంతా హైకోర్టుల చుట్టూ తిరగాల్సిందేనని ఎంపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన రాజకీయం కోసం పిల్లలను, ముసలివాళ్లను కూడా వాడుకుంటున్నారని సురేష్‌ విమర్శించారు.