క్లారిటీ ఇచ్చిన తమన్న

హీరోల పారితోషికాలపై పుకార్లు వస్తుంటాయి. హీరోయిన్ల ఎఫైర్లపై పుకార్లు వస్తుంటాయి. కానీ మిల్కీబ్యూటీ తమన్న విషయంలో ఇది రివర్స్ అయింది. ఆమె పారితోషికంపై తాజాగా ఓ దుమారం చెలరేగింది. త్వరలోనే ప్రారంభంకానున్న ఓ సినిమా కోసం ఆమె ఏకంగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందనే వార్త సంచలనం సృష్టించింది.

అసలే కరోనా కష్టకాలం. లాక్ డౌన్ తో ఇండస్ట్రీ స్లంప్ లో పడింది. ఇలాంటి టైమ్ లో తమన్న ఇంత డిమాండ్ చేయడం ఏంటని అంతా చెవులు కొరుక్కున్నారు. ఓవైపు తాప్సి, రకుల్ లాంటి హీరోయిన్లు తమ పారితోషికం తగ్గించుకుంటుంటే.. తమన్న ఇలా రెండున్నర కోట్లు అడగడం ఏం బాగాలేదంటూ కథనాలు కూడా వచ్చేశాయి. ఎట్టకేలకు వీటిపై తమన్న రియాక్ట్ అయింది.

రెండున్నర కోట్లు డిమాండ్ చేశాననడం అవాస్తవం అంటోంది మిల్కీబ్యూటీ. తన కెరీర్ లో రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని కావాలంటే తనతో వర్క్ చేసిన నిర్మాతల్ని అడిగి తెలుసుకోవచ్చని చెబుతోంది తమన్న. పాత్రలు నచ్చి కొన్ని సినిమాలకు సగం రెమ్యూనరేషన్ కు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ఇంతకీ తమన్నా భారీగా డిమాండ్ చేసినట్టు ప్రచారం జరిగిన ఆ సినిమా ఏంటో తెలుసా. అది రవితేజ సినిమా. త్వరలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. అందులో హీరోయిన్ గా తమన్నను సంప్రదిస్తున్నారు. అంతలోనే ఈ పుకారు వచ్చేసింది.