కరెన్సీ నోట్లపై వాజపేయి, సావర్కర్‌ బొమ్మ చూడాలని ఉంది-నాగబాబు

నటుడు నాగబాబు మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. ఇటీవల గాంధీని చంపిన గాడ్సేకు జైకొట్టిన నాగబాబు ఇప్పుడు మరోసారి గాంధీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు పెట్టారు.

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మాత్రమే ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లపై సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కర్, వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందంటూ ట్వీట్ చేశారు.

అలా చేయడం ద్వారా స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ అని వ్యాఖ్యానించారు. గాంధీ బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు ఇతర దేశభక్తుల బొమ్మలను కరెన్సీపై ముద్రించాల్సిందిగా చెప్పేవారని నాగబాబు చెప్పారు.

చాలా మంది మహానుభావుల పేర్లు తప్ప ముఖాలు గుర్తుకు రావడం లేదని… కరెన్సీ నోట్లపై వారి చిత్రాలను ముద్రించి వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఇటీవల పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరైన తర్వాత ఆర్ఎస్ఎస్ మనసు గెలిచేందుకు పవన్ తో పాటు నాగబాబు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని… అందులో భాగంగానే గాడ్సేకు వత్తాసు పలకడం వంటివి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.