ఎట్టకేలకు ఇండియా వచ్చాడు

దేశంలో లాక్ డౌన్ పడే టైమ్ కి హీరోహీరోయిన్లంతా ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడిన నటీనటులు ఎవ్వరూ లేరు. అంతా ప్రీ-ప్లాన్డ్ గా పక్కాగా అన్నీ సమకూర్చుకున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక్కరు మాత్రం బుక్కయిపోయారు. ఆ హీరో పేరు పృధ్వీరాజ్. అవును.. మలయాళంకు చెందిన ఈ హీరో లాక్ డౌన్ వల్ల విదేశంలో ఇరుక్కుపోయాడు. ఎట్టకేలకు ఇండియాకు వచ్చాడు.

ప్రస్తుతం ఆడుకాలమ్ అనే సినిమా చేస్తున్నాడు పృధ్వీరాజ్. ఈ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు. అక్కడి అందమైన ఎడారిలో షూటింగ్ పూర్తి చేశారు. ఇంతలోనే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియాలో లాక్ డౌన్ పడింది. విమానాలు రద్దయ్యాయి. దీంతో జోర్డాన్ లోనే ఇరుక్కుపోయాడు పృధ్వీరాజ్.

అలా 2 నెలల పాటు దేశంకాని దేశంలో ఉండిపోయిన ఈ హీరో, ఎట్టకేలకు ఇండియా చేరుకున్నాడు. విదేశాల నుంచి భారతీయుల్ని ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విమానాలు ఏర్పాటుచేయడంతో.. అందులో పృధ్వీరాజ్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన వెంటనే ఎవ్వర్నీ టచ్ చేయకుండా.. తనకు తానుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు ఈ హీరో. 14 రోజుల పాటు క్వారంటైన్ లైఫ్ గడిపి, ఆ తర్వాత కుటుంబంతో కలవబోతున్నాడు.