వెంకటేష్ కు మరో రీమేక్ దొరికినట్టే

తెలుగులో రీమేక్ స్పెషలిస్ట్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వెంకటేశ్. టాలీవుడ్ లో వెంకటేష్ చేసినన్ని రీమేక్ సినిమాల్ని మరే హీరో చేయలేదు. అయితే ఇందులో కూడా సెన్సిబుల్ కథల్ని ఎంచుకోవడం ఆయన స్టయిల్. ఉదాహరణకు దృశ్యం సినిమానే తీసుకుంటే, మరో తెలుగు హీరో ఈ కథను అంగీకరించడు. కానీ వెంకీ మాత్రం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాతో ఏకంగా హిట్ కొట్టాడు.

ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. దృశ్యం సినిమాకు రీమేక్ చేయబోతున్నట్టు మోహన్ లాల్ ప్రకటించాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశాడు. అటు దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఈ విషయాన్ని నిర్థారించాడు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, ఓ మంచి రోజు చూసి సినిమాకు కొబ్బరికాయ కొడతామని కూడా చెప్పేశాడు.

సో.. ఆటోమేటిగ్గా దృశ్యం-2 తెలుగులో రీమేక్ అవుతుంది. పైగా అది తప్పనిసరిగా వెంకటేష్ మాత్రమే చేయాలి. అలా వెంకీ ఖాతాలో మరో రీమేక్ ప్రాజెక్టు చేరబోతోంది. అయితే ఏ సినిమానైనా అంత సులభంగా అంగీకరించడు వెంకటేశ్. దృశ్యం-2 విషయంలో కూడా ఆయన వెంటనే ఒప్పుకుంటాడనే గ్యారెంటీ లేదు. ఆ కథ తనకు నచ్చాలి, పైగా అది మలయాళంలో హిట్టవ్వాలి.