Telugu Global
National

కోవిడ్-19 ఎఫెక్ట్... గుజరాత్ నమూనా డొల్లతనం బయటపడింది...

ఈ దేశానికి గుజరాత్ మోడల్ (నమూనా) అవసరమని.. దేశాభివృద్ధికి అక్కడ చేపట్టిన ప్రణాళికలే మార్గదర్శకమని ప్రధాని మోడీ ప్రతీ సారి చెబుతుంటారు. ఆయన రెండో సారి ప్రధాని కావడానికి ఈ గుజరాత్ మోడల్ ప్రచారం కూడా పెద్దగా కలిసి వచ్చింది. ఎంతో గొప్పగా ప్రచారం చేసిన ‘గుజరాత్ మోడల్’ ఒక విఫల ప్రయోగమని, దానిలోని డొల్లతనాన్ని కోవిడ్-19 బహిర్గతం చేసింది. కేరళ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కరోనా వైరస్‌పై పోరాటంలో ముందుండగా.. గుజరాత్ మాత్రం ఈ […]

కోవిడ్-19 ఎఫెక్ట్... గుజరాత్ నమూనా డొల్లతనం బయటపడింది...
X

ఈ దేశానికి గుజరాత్ మోడల్ (నమూనా) అవసరమని.. దేశాభివృద్ధికి అక్కడ చేపట్టిన ప్రణాళికలే మార్గదర్శకమని ప్రధాని మోడీ ప్రతీ సారి చెబుతుంటారు. ఆయన రెండో సారి ప్రధాని కావడానికి ఈ గుజరాత్ మోడల్ ప్రచారం కూడా పెద్దగా కలిసి వచ్చింది. ఎంతో గొప్పగా ప్రచారం చేసిన ‘గుజరాత్ మోడల్’ ఒక విఫల ప్రయోగమని, దానిలోని డొల్లతనాన్ని కోవిడ్-19 బహిర్గతం చేసింది.

కేరళ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కరోనా వైరస్‌పై పోరాటంలో ముందుండగా.. గుజరాత్ మాత్రం ఈ విషయంలో వెనుకబడింది.

దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో విజయం సాధించగా, మరికొన్ని రాష్ట్రాలు మానవతా దృక్పదంతో వ్యవహరించి ప్రజలను ఆదుకోవడంతో సఫలం అయ్యాయి. అదే సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం వలస కూలీలు, వైద్య సిబ్బంది విషయంలో వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది.

కోవిడ్-19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి సరైన రక్షన పరికరాలను అందజేయడంలో, కరోనా టెస్టుల విషయంలో, క్వారంటైన్ శిబిరాల్లో వసతుల కల్పన విషయంలో పూర్తిగా వెనుకబడింది. ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా.. గుజరాత్ మోడల్ మాత్రం విఫలమైంది.

కరోనా సంక్షోభ సమయంలో గుజరాత్ వైద్యాధికారులు స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన నకిలీ వెంటలేటర్ల బాగోతం సంచలనం సృష్టించింది. కృత్రిమ శ్వాస అందించే పరికరాలు, అంబూ బ్యాగులనే వెంటిలేటర్లుగా చెప్పి కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నిస్తోంది.

గుజరాత్‌లో దేశ సగటు కంటే ఎక్కువ కోవిడ్ మరణాల రేటు ఉండటానికి కారణం రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతీ సీఎన్‌సీ నుంచి కొనుగోలు చేసిన ధామన్-1 పరికరాలే అని.. వాస్తవానికి ఇవి వెంటిలేటర్లు కావని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చౌదా ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన స్నేహితుని కంపెనీకి లాభం చేకూర్చడానికే ఈ కొనుగోళ్లు జరిపారని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ ‘ది వైర్’ ఈ నకిలీ వెంటిలేటర్ల బాగోతంలో మరింత లోతైన విచారణ జరిపి సంచలన విషయాలు వెలుగులోనికి తీసుకొచ్చింది. మోడీకి రూ.10 లక్షల విలువైన సూట్‌ను గిఫ్టుగా ఇచ్చిన వ్యాపారవేత్తకు, వెంటిలేటర్లు సరఫరా చేసిన కంపెనీకి సంబంధాలున్నాయని చెబుతోంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా సదరు వెంటిలేటర్లను సీఎం రూపానీయే మార్కెట్లోకి విడుదల చేశారని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ సీఎం రూపాని మాత్రం సదరు వెంటిలేటర్లు సర్టిఫై చేసినవేనని.. రోగులకు అవి మెరుగైన సేవలు అందిస్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఆ వెంటిలేటర్లు సరఫరా జరిగినట్లు చెబుతున్నారు.

దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.1 శాతం ఉండగా.. గుజరాత్‌లో అది 6 శాతం వరకు ఉందని మాజీ మంత్రి జైరాం రమేష్ అంటున్నారు. అభివృద్ధి విషయంలో కేరళ, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధి విషయంలో తమిళనాడు నమూనాలు ఎప్పుడూ విఫలం కాలేదని… ఇండియా, అమెరికాలో ఉన్న మోడీ అనుచరగణం గుజరాత్ మోడల్ చాలా గొప్పదని నకిలీ ప్రచారం చేశారని ఆయన చెప్పారు.

దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పోల్చుకుంటే గుజరాత్ అభివృద్ధి చాలా తక్కువేనని ఆయన అన్నారు. 60, 70 దశకాల్లో గుజరాత్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల ఫలాలే ఇవాళ అందుతున్నాయని.. దీనికి గుజరాత్ మోడల్ కారణం కాదని ఆయన చెప్పారు.

అప్పట్లో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ అని పెట్టి.. అది కేజీ బేసిన్‌లో రూ. 2.20 లక్షల కోట్ల విలువైన గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నట్లు అబద్దపు ప్రచారం చేశారని.. అలాగే గుజరాత్‌లో స్మార్ట్ సిటీల నిర్మాణంలో కూడా మోడీ విఫలమయ్యారని జైరాం రమేష్ అంటున్నారు.

1991లోనే గుజరాత్‌లో 24 గంటల విద్యుత్ అందించామని.. మోడీ రాకముందే గుజరాత్‌లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాం.. కానీ మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ‘మా కార్డ్’ వల్ల ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులకు వేల కోట్ల నిధులు అందాయని.. అవన్నీ ఆయన స్నేహితులకే లబ్ది చేకూర్చాయని విమర్శించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లీఘీలే కారణమని ముఖ్యమంత్రి రూపానీ ఆరోపించడం ఒక విధంగా ఉహించిందేనని చెప్పవచ్చు. చాలా సంవత్సరాలుగా గుజరాత్ అధికార రాజకీయ వ్యవస్థ మైనారిటీ వర్గాలపై ఒక ప్రగాఢ అయిష్టతతో వ్యవహరిస్తూ వస్తోంది. ఆ అయిష్టత ఇంచు మించు విద్వేష స్థాయికి చేరింది. గుజరాత్ నగరాలు, పట్టణాలలో హిందూ -ముస్లింల మధ్య గతంలో కానరాని కన్పించని భౌగోళిక సరిహద్దులు ఇటీవలి సంవత్సరాల్లో స్పష్టంగా కన్పించసాగాయి.

గుజరాత్‌లో అమలు చేసింది మోడీ మోడల్ అని అది గుజరాత్ మోడల్ కాదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ప్రస్తుతం గుజరాత్‌కు రూ. 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్‌కు సమానం. మరి ఇన్నేళ్లలో గుజరాత్ మోడల్ సాధించిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.

First Published:  24 May 2020 12:39 AM GMT
Next Story