‘వలసకూలీలకు ఇవ్వాల్సింది డబ్బు… కేంద్ర ప్యాకేజీతో వారికి ఒరిగేది ఏం లేదు’…

కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20.9 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు.

ఈ ప్యాకేజీతో వలస కూలీలు, నిరుద్యోగులు, ఉపాధి కరువైన పేదలకు ఆహార ధాన్యాలు ఉచితంగా దొరుకుతాయేమో.. కానీ వాళ్లకు నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, నూనెలు, ఇంటి అద్దెల కోసం డబ్బు అవసరం అవుతుందన్నారు. కాబట్టి వారి అకౌంట్లలో నేరుగా డబ్బు వేయడం ఈ సమయంలో చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచమే అతిపెద్ద ఆర్థిక అత్యయిక స్థితిని ఎదుర్కుంటోంది. ఈ సమయంలో ఏ ప్యాకేజీ అయినా అన్ని అవసరాలు తీర్చలేదని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా ఇండియాలో ఆర్థికాభివృద్ధి నత్తనడకన సాగుతోంది. దేశంలో నిధుల కొరత కూడా భారీగానే ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఇంకా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని.. రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే నివేదికలను ఈ సమయంలో పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిదని రఘురాం అన్నారు. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బ్యాంక్‌లు, సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు.

మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని.. బ్యాంకులు, సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వివిధ రంగాలు మరింత కుంగిపోవడం ఖాయమని రఘురాం వెల్లడించారు.