నా జీవితంలో చెత్త మూమెంట్ అదే

ప్రతి హీరోయిన్ కు కొన్ని ఇబ్బందికర క్షణాలుంటాయి. నలుగురిలో నవ్వుల పాలైన సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే అందరూ వాటిని బయటకు చెప్పుకోరు. కొంతమంది తమలో తామే బాధపడితే, మరికొంతమంది అప్పటి అనుభవాల్ని తలుచుకొని తమలోతాము నవ్వుకుంటారు. హీరోయిన్ తేజశ్వి మాత్రం అలాంటి ఓ అనుభవాన్ని మనసులో దాచుకోలేదు. తాజాగా బయటపెట్టింది.

ఓ హాలిడే ట్రిప్ లో భాగంగా సముద్రం ఒడ్డుకు ఫ్రెండ్స్ తో కలిసి చేరుకుందట తేజశ్వి. అక్కడి అందమైన బ్రిడ్జ్ పై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. సెల్ఫీ వచ్చింది కానీ అదే క్షణంలో మొబైల్ చేజారిపోయింది. అది నేరుగా వెళ్లి సముద్రంలో పడిపోయింది. తను సెల్ఫీ తీసుకుంటున్న టైమ్ లో జనాలంతా తననే గమనిస్తున్నారని, సెల్ సముద్రంలో పడిపోయిన వెంటనే అక్కడున్న కొంతమంది బాగా నవ్వారని, అది తను భరించలేకపోయానని చెప్పుకొచ్చింది తేజశ్వి.

తన జీవితంలో బాగా చిరాకుతెప్పించే ఘటన అదేనని అంటోంది తేజశ్వి. అప్పట్నుంచి సెల్ఫీలు తగ్గించానని, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకొని సెల్ఫీ తీసుకుంటున్నానని తెలిపింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇలా తన జీవితంలోని అతి చెత్త మూమెంట్ ను బయటపెట్టింది తేజశ్వి.