టీటీడీ ఆస్తుల వేలంపై వైవీ వివరణ…

టీడీడీకి సంబంధించిన కొన్నిఆస్తులను విక్రయించేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకోవడంపై పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు దీనిపై విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.

ఆస్తుల విక్రయం ఆలోచన తమది కాదని… టీడీపీ హయాంలోనే పాలక మండలి నిర్ణయం తీసుకుందని దాన్ని అమలు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టీటీడీ నిరర్ధక ఆస్తులను గుర్తించేందుకు చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాలకమండలి ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వైవీ వివరించారు.

టీటీడీకి ఏ రకంగా ఉపయోగపడని… ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉన్న ఆస్తులను గుర్తించి వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు అప్పటి పాలక మండలి ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఆ సబ్‌ కమిటీలో నాటి టీటీడీ సభ్యులు భాను ప్రకాశ్‌ రెడ్డి, శేఖర్, డీపీ అనంత, ఎల్లా సుచరిత, సండ్ర వెంకట వీరయ్యలు సభ్యులుగా ఉన్నారన్నారు.

ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే టీటీడీకి నిరర్ధకంగా ఉన్న 50 ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాల్లో 9 ఆస్తులు, తమిళనాడులో 23 ఆస్తులను వేలం వేయాల్సిందిగా గత సబ్‌ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 50నిరర్ధక ఆస్తుల విలువను 23. 92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం చేసి ఆ ధరప్రకారం వేలం వేయడాలనికి ఆమోదం తెలిపిందన్నారు.

ఈ నిరర్ధకాస్తులు ఒక సెంటు నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములు ఉన్నట్టు వైవీసుబ్బారెడ్డి వివరించారు. వీటి వల్ల టీటీడీకి ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేకపోవడం, ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉన్నట్టుగా సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని… అందువల్లే వాటిని వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి అభ్యంతరం తెలిపారు.