బాబు పర్యటన రద్దు

చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయింది. విమానాలు అందుబాటులో లేనందున ఆయన విశాఖకు రాలేకపోతున్నట్టు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి విశాఖ పట్నానికి విమానంలో వచ్చి అక్కడ ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరకట్ట నివాసానికి చేరుకోవాలన్నది చంద్రబాబు ప్రణాళిక.

ఈ మేరకు ఏపీ డీజీపీకి దరఖాస్తు పెట్టుకోగా… ప్రత్యేక కేసుగా భావిస్తూ అనుమతి ఇస్తున్నట్టు డీజీపీ కార్యాలయం పాస్‌లు జారీ చేసింది. అయితే సోమవారం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి నడిచే విమాన సర్వీసులను రద్దు చేసినట్టు విమానయాన శాఖ ప్రకటించింది. దాంతో చంద్రబాబు పర్యటన రద్దు అయింది.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి కారణంగానే కేంద్ర విమానయాన శాఖ విశాఖకు విమానాల రాకపోకలను వాయిదా వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.

చంద్రబాబు పర్యటనకు డీజీపీ జారీ చేసిన పాస్‌ కేవలం సోమవారానికి మాత్రమే చెల్లుతుంది. చంద్రబాబు ఇప్పుడు మరోసారి డీజీపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.