ఏవి ఆనాటి రంజాన్ కళకళలు

  • 112 ఏండ్ల తర్వాత ఇండ్లకే పరిమితం
  • అప్పుడు మూసీ వరదలు.. ఇప్పుడు కరోనా

ముస్లింలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ రంజాన్. కఠినమైన ఉపవాస దీక్షలను విరమించి.. రంజాన్ రోజున మసీదులకు వెళ్లి సామూహిక ప్రార్థనలు చేసి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటారు.

రంజాన్ వస్తుందంటే హైదరాబాద్ పాతబస్తీ కళకళలాడుతుంటుంది. పురానాపుల్, నయాపుల్, మదీన, చార్మినార్, బడిచౌడి, సుల్తాన్ బజార్ వంటి ప్రాంతాలు ముస్లింల షాపింగ్‌లతో సందడిగా మారుతుంది. అసలు పండగే పాతబస్తీలో ఉన్నంత సంబురంగా.. ఉత్సాహంగా జరుపుకుంటారు.

కానీ ఆనాటి రంజాన్ సందడి ఇప్పుడు మాయం అయ్యింది. నెల రోజుల ఉపవాస దీక్షల సమయంలో కూడా మసీదుల వైపు కన్నెత్తి చూడలేకపోయారు. ఇప్పుడు పండుగను కూడా ఇండ్లలోనే చేసుకోవాల్సి వస్తోంది. దీనికి కారణం కరోనా మహమ్మారి. ప్రపంచాన్ని కబలిస్తోన్న కరోనా కారణంగా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా.. నలుగురితో కలవకుండా ఇండ్లలోనే తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. రంజాన్ అంటే హైదరాబాద్‌లోనే చూడాలి. చార్మినార్ ప్రాంతంలో జరిగే సామూహిక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొనడం కన్నుల పండువగా ఉంటుంది. కాని ఆ సందడి మటుమాయం అయ్యింది.

ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి కాదు. 112 ఏండ్ల క్రితం మూసీ నదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో మసీదులు, ఈద్గాలు తెరుచుకన్నాయి. కాని ఇండ్లలో నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నీళ్లే. దీంతో రంజాన్ పండుగను ఇంటికే పరిమితం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కరోనా వైరస్ ఈ రంజాన్ పండుగను వెలవెలబోయేటట్టు చేసింది.

రంజాన్‌ రోజు సందడి ఒక ఎత్తైతే.. అంతకు నెల రోజుల ముందుగానే జరిగే షాపింగ్ మరో ఎత్తు. కేవలం దుస్తులు, అలంకార సామాగ్రే కాకుండా.. పలు రకాల ఆహార పదార్థాలు, పండ్ల వ్యాపారం కోట్ల రూపాయల్లో సాగుతుంది. పాత బస్తీ ప్రాంతంలో కేవలం ఈ నెల రోజుల్లో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. కానీ ఈ సారి మార్కెట్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు అమ్మకాలు లేక డీలా పడ్డారు.

గత 70 ఏండ్లుగా హైదరాబాద్‌లో రంజాన్ సమయంలో హలీమ్, హారీస్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాని తొలి సారి హలీమ్ అమ్మకాలను ఈ ఏడాది జరపట్లేదని రెస్టారెంట్ యజమానులు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది ముస్లింలే కాకుండా హలీమ్ కోసం ఎదురు చూసిన ఎంతో మంది ఆహార ప్రియులు నిరాశపడ్డారు. ఏదేమైనా రంజాన్ ఇంటిలో చేసుకోవడం వల్ల కాస్త సరదా తగ్గుతుందేమో కానీ.. ఆ వైరస్ మహమ్మారి బారిన పడకుండా అందరం రక్షించబడతామని ముస్లింలు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు..

తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్‌ మత సామరస్యానికి నిదర్శనమని కేసీఆర్‌ అన్నారు. రంజాన్‌ సందర్భంగా వారి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి పండుగ జరుపుకోవాలని కేసీఆర్‌ ముస్లింలను కోరారు.

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యం, సహృద్భావం, దాతృత్వానికి ప్రతీక అని జగన్‌ మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు పాటిస్తూ కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పాటునందించడం లాంటివి ఈ పండుగ మానవాళికి ఇచ్చే గొప్ప సందేశమని సీఎం జగన్‌ అన్నారు.