ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపిస్తాం… ప్రజలనే మార్కులు వేయాలని కోరుతాం…

వ్యవస్థల్లో మార్పు తేవడం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి… మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించి… ఏఏ కార్యక్రమాలు చేశామో ప్రజలకు వివరిస్తామన్నారు.

మద్యం నియంత్రణ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే 43వేల బెల్ట్ షాపులను రద్దు చేశామన్నారు. మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే బెల్ట్ షాపులను నియంత్రించడం సాధ్యం కాదని గుర్తించి… ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వాహణను చేపట్టిందన్నారు. పర్మిట్‌ రూంలను కూడా తీసివేశామన్నారు. 20,30 మంది ఒకచోట కూర్చుని మద్యం తాగుతుంటే అటుగా వెళ్లాలంటే మహిళలు ఎంతగా ఇబ్బంది పడేవారో తాను స్వయంగా పాదయాత్ర సమయంలో చూశానన్నారు.

గతంలో మద్యం షాపులను అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేవారని… కానీ ఇప్పుడు సమయం కూడా కుదించివేశామన్నారు. ధరలు షాక్‌ కొట్టేలా చేయడం వల్లే ఇది వరకు వారంలో ఐదు సార్లు తాగే వారు ఇప్పుడు రెండుసార్లు మాత్రమే తాగుతున్నారని సీఎం వివరించారు. వారానికి ఐదు బాటిళ్లు తాగుతున్న వారు ఇప్పుడు రెండు బాటిళ్లు మాత్రమే తాగేలా చేశామన్నారు.

మొన్న ధరలు భారీగా పెంచడానికి ముందే ఏపీలో మద్యం విక్రయాలు 24 శాతం తగ్గాయన్నారు. మరోసారి భారీగా ధరలు పెంచిన తర్వాత విక్రయాలు మరింతగా పడిపోయాయన్నారు. గతంలో 23 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు ఉండగా… ఇప్పుడు అవి 10లక్షలకు తగ్గిపోయాయన్నారు. వ్యవస్థలో మార్పులు తెచ్చే విషయంలో తాము చిత్తశుద్దితో పనిచేస్తున్నామని జగన్‌ చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెస్తున్నామని… ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నామని… విలేజ్ క్లినిక్‌లు తెరుస్తున్నామని చెప్పారు.

ఆర్‌బీకేల ద్వారా రైతులకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామన్నారు. రైతులకు కావాల్సిన సలహాలను ఆర్‌బీకేల ద్వారా అందిస్తామన్నారు. వచ్చే ఏడాదికి ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తామన్నారు. అక్కడ రైతులు వారి ఉత్పత్తులను స్వయంగా అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి చూపిస్తామన్నారు. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపించి ఏఏ కార్యక్రమాలు చేశామో వారే పరిశీలించి మార్కులు వేసేలా చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పించన్ ఇచ్చేదని… ఇప్పుడు దాన్ని తాము 2వేల 250కి పెంచామన్నారు.