తెలంగాణ కరోనా భిన్నంగా ఉంది – సీసీఎంబీ డైరెక్టర్

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందన్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరో 30 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఐదు నుంచి 10 రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఆరు నెలలకు పైగా సమయం పడుతుందన్నారు. వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే జాగ్రత్తగా ఉండడం శ్రేయష్కరం అని సూచించారు.

తెలంగాణ, గుజరాత్‌, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అసాధారణ రీతిలో కరోనా ప్రభావం ఉందన్నారు. ఇతర ప్రాంతాల వైరస్‌ కంటే తెలంగాణలో ఉన్న వైరస్‌ భిన్నంగా ఉందని… దీనిపై లోతైన పరిశోధన జరుగుతోందని రాకేష్‌ మిశ్రా వెల్లడించారు.

ఇప్పటి వరకు తెలంగాణలో 1920 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే 66 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఏపీ తరహాలో రోజుకు వేల సంఖ్యలో టెస్ట్ లు చేస్తే తెలంగాణలో భారీగా కరోనా కేసులు బయటపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.