పవన్, బాలయ్య ఏం చేస్తున్నారు..?

బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన రాజకీయ నాయకులు. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఓ పార్టీ అధ్యక్షుడు. పోనీ రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలకు గ్యాప్ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇద్దరూ చెరో సినిమాతో బిజీగా ఉన్నారు, మిగతావి లైన్లో పెట్టుకున్నారు. మరి కరోనా లాక్ డౌన్ తర్వాత వీరికి సినిమాలతో పనిలేదా, షూటింగులు అక్కర్లేదా, నిర్మాతల కష్టాలు వీరికి పట్టవా? ఇదంతా ఎందుకు చర్చకొస్తోందంటే.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ల గురించి వీరిద్దరూ ఎక్కడా పెదవి విప్పలేదు.

ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రభుత్వాల చుట్టూ తిరుగుతూ షూటింగ్ లకి అవకాశమివ్వండి, సినీ కార్మికులకు న్యాయం చేయండంటూ అభ్యర్థిస్తుంటే.. బాలయ్య, పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇగో ప్రాబ్లమ్ తోనే మిగతా వాళ్లతో వీరిద్దరూ కలవడంలేదని తెలుస్తోంది. పోనీ కేసీఆర్ ని కలిసే సమావేశానికి వెళ్లకపోయినా.. అంతకు ముందు ఇండస్ట్రీ పెద్దలంతా పెట్టుకున్న మీటింగ్ కి అయినా వీరు వెళ్లాల్సింది. తమ సందేశాన్ని వినిపించాల్సింది.

సురేష్ బాబు లాంటివారు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సురేష్ బాబు సహా మరికొందరు చర్చలు జరిపారు. ఇటు ఏపీ సీఎం జగన్ కి చిరంజీవి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సింగిల్ విండో అనుమతులకు విడుదల చేసిన జీవోపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు, త్వరలో సీఎం జగన్ ని ఇండస్ట్రీ పెద్దలతో పాటు కలుస్తానని చెప్పారు చిరంజీవి.

ఇలా ఎవరికి వారు సినీ ఇండస్ట్రీ కోసం తమ వంతు లాబీయింగ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ లు మొదలవడానికి, సినిమా హాళ్లు తెరుచుకుకోడానికి కృషిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉండి కూడా బాలకృష్ణ, పవన్ ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు? కరోనా లాక్ డౌన్ సమయంలో కార్మికుల కోసం విరాళాలిచ్చారు సరే.. ఉపాధి సంగతి పట్టించుకోరా? లాక్ డౌన్ ఎత్తేసే సమయంలో ఎంత త్వరగా షూటింగ్ లు మొదలైతే ఇండస్ట్రీకి అంత మంచిది, మరి అలాంటి సమయంలో కూడా వీరిద్దరూ మౌనంగా ఉండటం దేనికి సంకేతం?

ఇండస్ట్రీ ప్రతినిధులుగా ముందుండి చక్రం తిప్పాల్సిన స్టేజ్ లో ఉన్న పవన్, బాలయ్య.. కనీసం మిగతావారితో కలసి వెళ్లడానికైనా ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ భవిష్యత్తు మొత్తం రాజకీయ నాయకుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. రాజకీయాల్లో ఉన్న ఈ హీరోలిద్దరూ ఇలాంటప్పుడు స్పందిస్తే అది పరిశ్రమకు ఎంతో మేలు చేసినట్టవుతుంది. కానీ బాలయ్య, పవన్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.