మహేష్ అలా… పవన్ ఇలా…

లాక్ డౌన్ మరో వారంలో ముగుస్తోంది. వచ్చేనెల రెండో వారం నుంచి షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కానీ పవన్, మహేష్ మాత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే మూడ్ లో లేరు. ఎందుకంటే.. లాక్ డౌన్ ఎత్తేసినా, షూటింగ్ మొదలుపెట్టినా కరోనా ఛాయలు మాత్రం ఇంకా వీడిపోలేదు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ ఇద్దరు హీరోలు ఇంకొన్నాళ్ల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో సినిమాను లాంఛ్ చేయబోతున్నాడు మహేష్. మూవీ అయితే అధికారికంగా ప్రారంభమౌతుంది. కానీ మహేష్ మాత్రం సెట్స్ పైకి వచ్చేది ఆగస్ట్ లోనే. ఈ మేరకు దర్శకనిర్మాతలకు అతడు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈలోగా క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఉండే సన్నివేశాలు తీసుకోమని చెప్పేశాడట.

అటు పవన్ కూడా అంతే. లెక్కప్రకారం పవన్ ఓ 10 రోజులు సెట్స్ పైకి వస్తే చాలు, వకీల్ సాబ్ షూటింగ్ అయిపోతుంది. కానీ పవన్ మాత్రం కనీసం జూన్ చివరి వారం వరకు షూటింగ్స్ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. కుదిరితే జులైకు షెడ్యూల్స్ వాయిదావేసే ఆలోచనలో కూడా ఉన్నాడు.

ఇంకా ఎంతమంది హీరోలు ఇలా మహేష్, పవన్ బాటలో షూటింగ్స్ వాయిదా వేసుకుంటారో చూడాలి. ఈ లెక్కల షూటింగ్స్ కు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా బడా సినిమాల విషయంలో అది వృధా కిందే లెక్క.