బాబుకు బిగ్ షాక్‌… హోదాకు ఎర్త్‌…

తెలుగుదేశం పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కాబోతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఒకరు, గుంటూరు జిల్లా నుంచి ఒకరు సైకిల్ దిగుతున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు టీడీపీని వీడుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేల తరహాలోనే ఈ ఇద్దరు కూడా ప్రత్యేక సభ్యులుగా ఉండేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డితో వీరుచర్చలు జరిపారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని కలిశారు. నేడోరేపో వీరు వైఎస్‌ జగన్‌ను కలవబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును… ఏలూరి సాంబశివరావు ఓడించారు. రేపల్లి నుంచి మోపిదేవి వెంకటరమణను అనగాని సత్యప్రసాద్ ఓడించారు.

ప్రకాశం జిల్లాలో టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే మంచి ఫలితాలనే సాధించింది. జిల్లా నుంచి నలుగురు టీడీపీ తరపున గెలిచారు.వీరిలో ఇప్పటికే కరణం బలరాం టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఏలూరి సాంబశివరావు వస్తున్నారు. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, కొండేపి ఎమ్మెల్యే స్వామి తెలుగుదేశం పార్టీలో మిగిలారు.

మొత్తం 23 మంది టీడీపీ తరపున గెలవగా ఇప్పటికే కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి టీడీపీని వీడారు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్‌, ఏలూరు సాంబశివరావులు కూడా టీడీపీని వీడితే ఆ పార్టీ బలం 18కి పడిపోతుంది. ప్రస్తుతం 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నేత హోదా ఉంటుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడితే 18కి బలం పడిపోతోంది. మరొక ఎమ్మెల్యే టీడీపీని వీడినా చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతారు.