Telugu Global
NEWS

పోలవరం కుడికాలువ సామర్థ్యం 50వేల క్యూసెక్కులకు పెంచుతాం...

ఆంధ్రప్రదేశ్‌లో కరువు లేకుండా చేసేందుకు యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ‘మన పాలన… మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి… ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే వ్యవసాయానికి మనుగడ ఉంటుందన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క సాగునీటి ప్రాజెక్టులోనే వెయ్యి 95 కోట్లు ఆదా చేయగలిగామన్నారు. వదిలేసి ఉంటే ఆ సొమ్ము నాయకుల […]

పోలవరం కుడికాలువ సామర్థ్యం 50వేల క్యూసెక్కులకు పెంచుతాం...
X

ఆంధ్రప్రదేశ్‌లో కరువు లేకుండా చేసేందుకు యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతామని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ‘మన పాలన… మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి… ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే వ్యవసాయానికి మనుగడ ఉంటుందన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క సాగునీటి ప్రాజెక్టులోనే వెయ్యి 95 కోట్లు ఆదా చేయగలిగామన్నారు. వదిలేసి ఉంటే ఆ సొమ్ము నాయకుల జేబుల్లోకి వెళ్లేదన్నారు.

రాష్ట్రంలో ఏఏ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలన్న దానిపై స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందని వివరించారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం ఇకపై ఉంటుందన్నారు. రాబోయే ఏడాదిలో వంశధార ఫేజ్ 2, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్‌ 1, నెల్లూరు బ్యారేజ్‌, అవుకు టన్నెల్ పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే జాతికి అంకితమిస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు కరోనా వల్ల కొంచెం నెమ్మదించాయని అయినప్పటికీ తిరిగి పనులు పుంజుకునేలా చేసి 2021కి పూర్తి చేసి తీరుతామన్నారు. రాయలసీమ కరువు నివారణ పథకం కింద ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టులు చేపడుతుంటే వాటి చుట్టూ అనేక వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు.

ఈ విషయంలో ఒక్క చంద్రబాబుతోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. అయినప్పటికి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు రావాలంటే ప్రాజెక్టులు నిర్మించక తప్పదన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే 44వేల క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటోందన్నారు. నీటిమట్టం 854 అడుగులకు పడిపోతే 7వేల క్యూసెక్కులు మాత్రమే నీరు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమ కరువు ఎప్పుడు తీరుతుంది?… ఎప్పుడు నీరు వెళ్తుంది? అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేవలం 10 రోజులు మాత్రమే 881 అడుగుల ఎత్తులో వరద ఉంటోందని …ఆ సమయంలోనే రాయలసీమకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.

పక్కనే ఉన్న తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 800 అడుగుల నుంచే నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని కూడా 796 అడుగులకు నీరు ఉన్నా తెలంగాణ వైపు నుంచి మొదలుపెడుతున్నారన్నారు. దీని వల్ల రాయలసీమ , ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఇబ్బందుల్లో పడిపోతున్నాయన్నారు. దీనికి పరిష్కారం తెలంగాణ తరహాలోనే 800 అడుగుల్లో మనవైపు కూడా నీరు తీసుకునేలా లిప్ట్‌ నిర్మించడమేనన్నారు. దీని వల్ల అందరికీ సమంగా నీరు అందే అవకాశం ఉంటుందన్నారు.

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరు అందించేందుకు 27వేల కోట్లతో కరువు నివారణ నీటి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ఇదే సమయంలో పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 50వేల క్యూసెక్కులకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 50వేల క్యూసెక్కుల నీరు వచ్చేలా కాలువను విస్తరిస్తామన్నారు.

పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని 17వేల 500 క్యూసెక్కుల నుంచి 50వేలకు పెంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నీటిని తీసుకొస్తామన్నారు. ఈ చర్యల వల్ల కృష్ణా డెల్టాతో పాటు అన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల టెండర్లకు ఈ ఏడాదే పిలుస్తామన్నారు.

First Published:  26 May 2020 3:33 AM GMT
Next Story