Telugu Global
NEWS

కొండపోచమ్మతో ఎల్లుండి నుంచి నాలుగు జిల్లాలకు సాగునీరు

ఒక రోజు అటూ ఇటూ కావొచ్చు.. కానీ కేసీఆర్ సాధిస్తాడు. ఇదీ తెలంగాణ ప్రజల్లో ఉండే ధైర్యం. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు నుండీ సీఎం కేసీఆర్‌ది అదే పట్టుదల. కాళేశ్వరం డిజైన్ మార్చి.. తాను తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తా అని అంటే.. ప్రతిపక్షాలు నవ్వాయి. మేడిగడ్డ నుంచి గోదావరిని తీసుకొచ్చి మెతుకు సీమ (మెదక్)లో పారిస్తా అంటే అందరూ ‘నిజమా..?’ అంటూ విమర్శలు గుప్పించారు. ఎందరు నవ్వినా.. ఎవ్వరు విమర్శించినా పట్టించుకోని సీఎం కేసీఆర్ […]

కొండపోచమ్మతో ఎల్లుండి నుంచి నాలుగు జిల్లాలకు సాగునీరు
X

ఒక రోజు అటూ ఇటూ కావొచ్చు.. కానీ కేసీఆర్ సాధిస్తాడు. ఇదీ తెలంగాణ ప్రజల్లో ఉండే ధైర్యం. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ముందు నుండీ సీఎం కేసీఆర్‌ది అదే పట్టుదల. కాళేశ్వరం డిజైన్ మార్చి.. తాను తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తా అని అంటే.. ప్రతిపక్షాలు నవ్వాయి. మేడిగడ్డ నుంచి గోదావరిని తీసుకొచ్చి మెతుకు సీమ (మెదక్)లో పారిస్తా అంటే అందరూ ‘నిజమా..?’ అంటూ విమర్శలు గుప్పించారు. ఎందరు నవ్వినా.. ఎవ్వరు విమర్శించినా పట్టించుకోని సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. గలగలా పారే గోదారి నీటిని కరువు సీమకు తరలించారు. మరో రెండు రోజుల్లో కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి గోదావరి నీళ్లు విడుదల కాబోతున్నాయి.

ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి సిద్దిపేట. కింద ఎక్కడో ప్రవహిస్తున్న నదిని ఒడిసి పట్టి ఏకంగా అరకిలోమీటరు ఎత్తుకు తీసుకొని రావలనుకున్న భగీరథప్రయత్నం సఫలమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతిపెద్ద జలాశయమైన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ ప్రాంతంలో మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) నిర్మించిన ఈ జలాశయం వల్ల సిద్దిపేట, మెదక్, మేడ్చెల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ జలాశయ నిర్మాణం కోసం రూ.1,778 కోట్లు వ్యయం కాగా, 4,600 ఎకరాలు సేకరించారు. కొండపోచమ్మ సాగర్ కట్ట పొడవు 15.8 కిలోమీటర్లు కాగా.. ఇందులో 15 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది.

మేడిగడ్డ దగ్గర సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తువద్ద నీటిని తీసుకొని 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయానికి చేర్చనున్నారు. దీనికి సంబంధించిన పనులను మేఘా సంస్థ 2018 జనవరిలో ప్రారంభించింది. అదే ఏడాది డిసెంబర్‌లోనే జలాశయాన్ని రికార్డు స్థాయిలో మేఘా పూర్తి చేసింది. ఈ జలాశయానికి నీటిని మల్లన్నసాగర్ నుంచి మళ్లించాలి. ఇందు కోసం 18 కిలోమీటర్ల కాలువను కూడా తవ్వారు. అయితే మల్లన్నసాగర్ ఇంకా పూర్తికాకపోవడంతో.. మరో కాలువ ద్వారా కొండపోచమ్మకు నీటిని మళ్లిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో చోట ఆరు పంపులతో రెండు లిఫ్టులు నిర్మించింది మేఘా సంస్థ. వీటికోసం రూ. 2,100 ఖర్చయ్యింది. ఈ రెండు లిఫ్టులు పనిచేస్తే 25 రోజుల్లో కొండపోచమ్మసాగర్ నిండిపోతుంది.

కొండపోచమ్మసాగర్ నుంచి కేవలం సాగునీరే కాకుండా సమీప గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని కూడా అందిస్తారు. అలాగే జలాశయం సమీపంలో 15 ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే అత్యధిక ఆయకట్టు ఉంది. అలాగే కీసర కాలువ ద్వారా హైదరాబాద్ సమీపంలోని ఆయకట్టుకు కూడా నీరు అందనుంది.

ఈ నెల 29న కేసీఆర్ ఈ జలాశయాన్ని ప్రారంభించనుండగా.. శ్రీ చినజియార్ స్వామి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

First Published:  26 May 2020 11:55 PM GMT
Next Story