Telugu Global
NEWS

లాక్‌డౌన్ కాలంలో 196 మంది వలస కార్మికులను బలిగొన్న రోడ్డు ప్రమాదాలు

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడం వలస కూలీల పాలిట శాపమైంది. అసలే వలసొచ్చిన రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల పనులు లేక, ఆదాయం వచ్చే మార్గం లేక, తిండి లేక కరువుతో లక్షలాది మంది సొంతూర్ల బాట పట్టారు. కాలినడకన, సైకిళ్లపై, ప్రైవేటు వాహనాల్లో వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కానీ వీరిలో అందరూ వారి ఇండ్లకు చేరుకోలేకపోయారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ చేసిన సర్వేలో అనేక బాధాకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. గత […]

లాక్‌డౌన్ కాలంలో 196 మంది వలస కార్మికులను బలిగొన్న రోడ్డు ప్రమాదాలు
X

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడం వలస కూలీల పాలిట శాపమైంది. అసలే వలసొచ్చిన రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల పనులు లేక, ఆదాయం వచ్చే మార్గం లేక, తిండి లేక కరువుతో లక్షలాది మంది సొంతూర్ల బాట పట్టారు. కాలినడకన, సైకిళ్లపై, ప్రైవేటు వాహనాల్లో వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కానీ వీరిలో అందరూ వారి ఇండ్లకు చేరుకోలేకపోయారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ చేసిన సర్వేలో అనేక బాధాకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

గత మార్చి 25 నుంచి ఇండ్లకు బయలుదేరిన వలస కూలీలలో 196 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 1,343 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. వాటిలో 601 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అంటే గత రెండు నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సంఖ్య 33 శాతం ఉండటం గమనార్హం.

అదే సమయంలో 1,161 మంది గాయాల పాలుకాగా.. వీరిలో 866 మంది వలస కార్మికులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. దేశంలో రోడ్లు ఎంత ప్రమాదకరంగా మారాయో ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు పూర్తి ట్రాఫిక్ ఉన్న సమయంలో జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి నిష్పత్తి 25 శాతం ఉండగా.. లాక్‌డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు, మరణాల శాతం ఏ మాత్రం మార్పు లేకుండా 25 శాతం గానే ఉన్నట్లు ఈ సర్వే నిర్వహించిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పీయుష్ తివారీ చెబుతున్నారు.

కేవలం వలస కార్మికులే కాదు… లాక్ డౌన్ సమయంలో 35 మంది అత్యవసర సేవల సిబ్బంది కూడా ప్రమాదాల కారణంగా చనిపోగా.. మరో 31 మంది గాయాలపాలయ్యారు. ఇక సాధారణ పౌరులు 370 మంది చనిపోగా.. మరో 274 మంది గాయాలపాలయ్యారు.

మన దేశంలో రోడ్ సేఫ్టీ అనేది నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని.. అనేక రోడ్లు ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించకపోవడం.. లోపాలు కలిగిఉండటం ఈ ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. అంతే కాకుండా ర్యాష్ డ్రైవింగ్‌కు తోడు.. వందల కిలోమీటర్లు ఏకధాటిగా నడపడంతో డ్రైవర్లు అలసటతో ప్రమాదాలకు కారణమవుతున్నారని సర్వే తేల్చింది.

గత రెండు నెలలుగా దేశంలోని రోడ్లపై ట్రాఫిక్ పెద్దగా లేదు. ఈ సమయాన్ని లోపాలున్న ప్రదేశాలను సరి చేసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని, రోడ్ల నిర్వహణ వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

First Published:  27 May 2020 1:45 AM GMT
Next Story