ట్రెయిన్‌లో 39 గంటల ప్రయాణం… ఆకలికి తాళలేక చిన్నారి మృతి

లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని పోయిన వలస కార్మికులను తరలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో ఈ ఘటన చూస్తే తెలుస్తుంది.

వలస కార్మికులను తరలించడానికి శ్రామిక్ రైళ్లను వేసి చేతులు దులుపుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అవసరమైన ఆహారం, నీరు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో నాలుగేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

బీహార్‌కు చెందిన పింటూ ఆలమ్.. తర కుటుంబంతో సహా సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి పట్నాకు శ్రామిక్ రైళ్లో బయల్దేరాడు. సాధారణంగా ఢిల్లీ నుంచి పట్నాకు 15 గంటల ప్రయాణ సమయం ఉంటుంది. కానీ ఈ శ్రామిక్ రైలు పట్నాకు చేరుకోవడానికి 39 గంటలు పట్టింది. ఇంత సేపు రైల్లో వారికి ఆహారం, నీళ్లు అందించేవాళ్లే లేకుండా పోయారు. అతని నాలుగేండ్ల కొడుకు మహ్మద్ ఇర్షాద్ ఆకలితో ఏడ్చినా అతనికి తిండిని అందించలేక ఆలమ్ నరకయాతన అనుభవించాడు. అతని దగ్గర కొద్దిపాటి డబ్బు ఉన్నా.. దారి పొడుగూతా ఏ స్టేషన్‌లో కూడా క్యాంటీన్లు, దుకాణాలు తెరిచిలేవు. దీంతో కనీసం బిస్కెట్లు కొనడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.

లక్నో స్టేషన్‌లో వీరికి పూరీలు, రెండు పాల ప్యాకెట్లు ఇచ్చారు. మొత్తం పదహారు మంది ఉంటే వీరికి ఐదు ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు పూరీలు మాత్రమే ఉన్నాయి. అక్కడ నుంచి బయల్దేరిన రైలు పట్నాకు చేరుకుంది. అక్కడ నుంచి వీరందరూ దనపుర్ వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో ఒక ట్రక్‌లో బయల్దేరారు. దనపూర్ చేరుకున్నాక మరో రైళ్లో ముజఫర్‌పుర్ వచ్చారు.

ముజఫర్‌పుర్ స్టేషన్‌ నుంచి వారి సొంతూరు వెస్ట్ చంపరన్ వెళ్లడానికి మరో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆలమ్ తన కొడుకు మహ్మద్ ఇర్షాద్ కదలడం లేదని గుర్తించాడు. శరీరం మొత్తం చల్లగా మారిపోయింది. అతడు ఆకలికి తట్టుకోలేక చనిపోయాడని గుర్తించి బోరున విలపించాడు. అక్కడే ఉన్న డాక్టర్ కూడా పరీక్షించి ఇర్షాద్ చనిపోయినట్లు నిర్థారించాడు.

తన కొడుకు చావుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌దే బాధ్యత. రంజాన్ రోజే తన కొడుకును పోగొట్టుకున్నాను. జీవితంలో మరోసారి రంజాన్ జరుపుకోను అని విలపించాడు. ఈ ఘటనపై ముజఫర్‌పుర్ జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్లు పిల్లాడిని తమ దగ్గరకు తీసుకొచ్చేసరికే మరణించాడని ఆయన అన్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఒక్కో ట్రైన్‌లో 1200 మంది మాత్రమే వస్తున్నారని మాకు సమాచారం ఉంది. ఆ మేరకే ఫుడ్ ప్యాకెట్లు సిద్దం చేస్తున్నాం. కానీ రైల్లో మాత్రం 2వేల మందికి పైగా ఉంటున్నారని సింగ్ చెప్పారు.

ఈ ఒక్క ఘటనే కాదు. మరో శ్రామిక్ రైళ్లో నెలన్నర పసికందు వేడికి తాళలేక మరణించాడు. మరో 48 ఏండ్ల వ్యక్తి కూడా ఎండదెబ్బకు మృతి చెందాడు.