Telugu Global
NEWS

కార్పొరేట్‌ కాలేజీలపై ఉక్కు పాదం

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ కాలేజీలకు చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై కొరడా ఝులిపించింది. కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ఇష్టానికి అడ్మిషన్లు తీసుకునే అవకాశం కాలేజీలకు ఉండదు. జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్‌కు కేవలం 40 మంది విద్యార్థులను మాత్రమే పరిమితం చేసేలా ప్రభుత్వం జీవో 23ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతి కాలేజీలోనూ సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు మాత్రమే […]

కార్పొరేట్‌ కాలేజీలపై ఉక్కు పాదం
X

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ కాలేజీలకు చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై కొరడా ఝులిపించింది. కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది.

ఇకపై ఇష్టానికి అడ్మిషన్లు తీసుకునే అవకాశం కాలేజీలకు ఉండదు. జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్‌కు కేవలం 40 మంది విద్యార్థులను మాత్రమే పరిమితం చేసేలా ప్రభుత్వం జీవో 23ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ప్రతి కాలేజీలోనూ సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఆ సెక్షన్లు కూడా కనిష్టంగా నాలుగు ఉంటాయి. కాలేజీలు అన్ని రకాల సదుపాయాలను, విశాలమైన గదులను, అధ్యాపకులను చూపితే గరిష్టంగా 9 సెక్షన్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.

మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ నిబంధనల ప్రకారం ప్రతి సెక్షన్‌లో 40 మందికి మించి విద్యార్థులు ఉండడానికి వీల్లేదు. కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కార్పొరేట్‌ కాలేజీలకు మేలు చేసే ఉద్దేశంతో ఒక్కో సెక్షన్‌లో ఏకంగా 80 మంది విద్యార్థులను ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక వ్యక్తిగత ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రభుత్వం సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సెక్షన్‌కు 40 మంది విద్యార్థులనే ఉంచేలా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ప్రతి కార్పొరేట్ కాలేజీ కూడా సైన్స్ గ్రూపులతో పాటు ఆర్ట్స్ గ్రూపులను కూడా నిర్వహించడం తప్పనిసరి. ఇప్పటి వరకు చాలా కార్పొరేట్ కాలేజీలు ఇరుకు గదుల్లో, సరైన భవనాలు లేకపోయినా, ఆట స్థలం, సరైన అధ్యాపకులు లేకుండానే భారీగా విద్యార్థులను చేర్చుకుంటూ వచ్చాయి. ఇకపై అది కుదరదు. కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం ఇలా అన్ని సదుపాయలకు సంబంధించిన ఫొటోలను తీసి జియో ట్యాగింగ్ ద్వారా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాతనే అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.

ఫైర్‌ సేప్టీ కూడా లేని భవనాల్లో కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహిస్తున్న నేపథ్యంలో… ఇకపై ఆ భవనాలకు సంబంధించిన ప్లాన్‌తో పాటు, ఫైర్ సేప్టీ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆట స్థలంతో పాటు, పార్కింగ్ స్థలం కూడా ఉండాలి.

ఇకపై కార్పొరేట్‌ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారం అడ్మిషన్లు చేయడానికి లేదు. అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై తక్షణం చర్యలు తీసుకుని వాటి అనుమతులను రద్దు చేయనున్నారు.

First Published:  28 May 2020 2:05 AM GMT
Next Story