రాజధాని తరలింపు ముహూర్తం వెల్లడి

విశాఖపట్నానికి పరిపాలన రాజధాని తరలింపు ఎప్పుడన్న దానిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడిన ఆయన… అక్టోబర్ 25 విజయదశమి రోజును రాజధాని తరలింపుకు ముహూర్తంగా నిర్ణయించినట్టు చెప్పారు. అక్టోబర్ 25న రాజధాని తరలింపు కార్యక్రమం చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రికి సూచించినట్టు చెప్పారు.

సెప్టెంబర్‌లోనే వెళ్లాలని సీఎం భావించినా… ఆ నెలలో మంచి రోజులు లేవని వివరించినట్టు ఆయన చెప్పారు. అక్టోబర్ 25 విజయదశమి రోజును రాజధాని తరలింపుకు ముహూర్తంగా పెట్టానని… ఆ లోపు ఇతర సమస్యలన్నీ కూడా సమసిపోతాయని వివరించారు.

అక్టోబర్ 25వ తేదీన దశమి తిథి ఉదయం 7గంటల 41 నిమిషాలకు ప్రారంభమవుతుందని.. ఇది మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం 9 గంటలకు ముగుస్తుందని చెప్పారు. ఆ ముహూర్తంలో రాజధాని తరలింపు ఉంటుందని వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్టుగా మిలినియం టవర్స్‌లో సచివాలయం ఉండడం లేదు. గ్రేహౌండ్‌ కాంఫౌండ్‌లో ఉండబోతోంది.

ఈనెల 28న పరిమిత సిబ్బందితో విశాఖకు రాజధానిని తరలించాలని తొలుత భావించినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు.