తెలంగాణ ధాన్యాగారం… వెనుకున్నది ‘మేఘా’

గోదావరి జలాలతో తెలంగాణ ధాన్యాగారంలా రూపుదిద్దుకునేందుకు చేపట్టిన కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలోని కీలకమైన పనులను మేఘా (ఎంఈఐఎల్)‌ రికార్డ్‌ సమయంలో పూర్తి చేసి ఘనత దక్కించుకుంది.

ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఎత్తిపోతల పథకంలోని అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను మేఘా పూర్తిచేసి తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది.

మొత్తం 22 పంపింగ్ కేంద్రాలలో 96 మెషిన్లు (ఒక పంపు, ఒక మోటారును కలిపితే మిషన్ అవుతుంది ) 4,680 సామర్థ్యంతో నిర్మిస్తుండగా అందులో 15 కేంద్రాలలో 89 మెషిన్లను 3,840 సామర్థ్యంతో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్‌ ద్వారా వినియోగంలోకి (ఆపరేషన్‌, మెయిన్‌టెనెన్స్‌) తీసుకురావడం ద్వారా మరో ఘనతను సాధించింది.

ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నీటిపారుదల శాఖ నిరంతర పర్యవేక్షణకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం, ఏబిబి, క్రాంప్టన్‌ గ్రేవ్స్‌, వెగ్‌ లాంటి సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా ఇక్కడ భారీ స్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. గత ఏడాది జూన్‌లో అంటే నిర్మాణ పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్‌-1, లింక్‌-2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి.

కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

రికార్డు సమయంలో 3763 మెగావాట్లు

తాజాగా ప్యాకేజ్‌-14 లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. ఇంజనీరింగ్‌ చరిత్రలో ఇది ఒక అద్భుతం. నీటి పారుదల రంగంలో ఎత్తైన ప్రాంతానికి దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌చేసే విధంగా భారీ ఎత్తిపోతల పథకం పూర్తిచేసుకుంది.

సాగునీటి అవసరాల కోసం ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పెదద్ది కాగా ఆ పథకంతో పోలికలేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వేరపోయే విధంగా పనులు రికార్డ్‌ సమయంలో పూర్తయ్యాయి.

ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది లేదు. ఉపరితలంపై కేవలం రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకానికే దశాబ్దాలు పడుతున్న ఈ కాలంలో పూర్తిగా ఎలక్ట్రో మెకానికల్‌ సంక్లిష్టలతో కూడిన పైగా అనేక పనులు భూగర్భంలో చేపట్టిన కాళేశ్వరం మాత్రం నాలుగేళ్ళలోనే పూర్తయ్యింది.

మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక (15) కేంద్రాలను (భూ ఉపరితలం పైన 11, భూ అంతర్భాగంలో 4) మేఘా‌ నిర్మించింది. రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్‌చేసే విధంగా నిర్మించిన కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వాటిని మేఘా‌ నిర్మించింది. వీటిలో 9 కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. మరో నాలుగు పంపింగ్‌ కేంద్రాలు మేఘా‌ పరంగా పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు పంపింగ్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇప్పటివరకు పూర్తయిన పంపింగ్‌ కేంద్రాలు 3763 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. 35.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలు పూర్తయ్యాయి. మరో 41 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 పంపింగ్‌ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం మీద మేఘా ఇంజనీరింగ్‌ రోజుకు 2 టీఎంసీల సామర్థ్యం కింద 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పనులను చేపట్టింది.

మొత్తం పంపింగ్‌ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్‌ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్‌-8), అన్నపూర్ణ (ప్యాకేజ్‌-10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్‌-12) భూగర్భంలో నిర్మించినవే.

ఇందులో ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3 ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్‌, అదనపు సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే పెద్దవి.

ఈ ప్రాజెక్ట్‌లో లింక్‌-1, లింక్‌-2 పంప్‌హౌస్‌లు చాలా కీలకమైనవి. లింక్‌-1లో ప్రాణహిత జలాలను గోదావరిలోకి అంటే శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి జలాశయంలోకి తీసుకురావడం. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్‌ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28 మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు. ఆ తర్వాత ప్యాకేజ్‌-8 పంపింగ్‌ కేంద్రం గాయత్రి.

భూగర్భంలో అద్భుతం – గాయత్రి నిర్మాణం పూర్తి

గాయత్రి (ప్యాకేజ్‌-8) పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతవరకు ఒక పంపింగ్‌ కేంద్రం ఇంత పెద్ద సామర్థ్యంతో అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం ఇంజనీరింగ్‌ అద్భుతం. ఇంజనీరింగ్‌ రంగంలో ఈ పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో ఎక్కడా లేనిదిగా ప్రసిద్ధికెక్కింది. జంట టన్నెల్స్ తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జిపూల్స్ ఇందులోని ప్రత్యేకత.

ఈ అల్డ్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయగల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్లను కంప్యూటేషనల్‌ ఫ్ల్యూయిడ్‌ డైనమిక్స్‌ (సీఎఫ్డీ) టెక్నాలజీతో దేశంలో తయారు చేసి మేక్‌ ఇన్‌ ఇండియాకు ప్రతిరూపం. ఈ పంపింగ్‌ కేంద్రంలో నిర్మించిన సర్జ్‌పూల్స్‌ ఈఫిల్‌ టవర్‌ కన్నా పొడవులో పెద్దది. ఒక్కొక్కటి సుమార్‌ 3000 క్యూసెక్కుల నీటిని 111 మీటర్ల ఎగువకు పంప్‌చేసే విధంగా భూగర్భంలో ఈ ప్రాజెక్ట్‌ను మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించింది.

బీహెచ్‌ఈఎల్‌ సహకారంతో మేఘా సృష్టించిన మహాద్భుతం. ఇంజనీరింగ్‌ వండర్‌. ఒక్కొక్క మిషన్‌ సామర్థ్య పరంగా చూస్తే ప్రపంచంలో ఇదే పెద్దది. 7 మిషన్‌ల మొత్తం సామర్థ్యం చూసినా కూడా ఇంత పెద్ద పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ పూర్తికాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గాయత్రి పంపింగ్‌ కేంద్రాన్ని భూగర్భంలో ఇంత భారీ ఎత్తున నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

470 అడుగుల దిగువన 327 మీటర్లు పొడవు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తుతో ఈ పంప్ హౌస్ నిర్మాణం అంటే అది ఎంత పెద్దదో ఊహించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2 టిఎంసీల నీటి పంపింగ్‌కు గాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేస్తున్న 89 మిషన్‌లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తుందంటే కాళేశ్వరంలో మేఘా పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చని బి. శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

రంగనాయక సాగర్ లో రెండో అత్యధిక సామర్థ్యం

ప్యాకేజ్‌-11లోని రంగనాయక సాగర్‌లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మిషన్‌లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 4 యూనిట్ల ద్వారా 536 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం ఏర్పాటయ్యింది. ఒక్కొక్క మిషన్‌ సామర్థ్యం వారిగా పరిశీలిస్తే గాయత్రి పంప్‌హౌస్‌ మిషన్‌ తర్వాత రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌-11) ప్రపంచంలో రెండవ అతిపెద్ద సామర్థ్యం తో 2వ సామర్థ్యం కలిగిన పంపింగ్‌ యూనిట్‌ పేరుగాంచింది.

తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌, ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్‌ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోని అతి పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని బి. శీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సాగునీటి రంగంలో అందులోనూ ఎత్తిపోతల పథకం కోసం ఇంతపెద్ద స్థాయిలో పంపింగ్‌ కేంద్రాలను అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్‌లను ఏర్పాటు చేయడం ఈ పథకం ద్వారా ప్రపంచ రికార్డ్‌ను తెలంగాణ నీటి పారుదల శాఖ సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ ఇంతటి భారీ పంపింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

భారీ విద్యుత్ వ్యవస్థ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతిపెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. అది ఎంతపెద్దదంటే.. 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 25 శాతం ఉందంటే ఇది ఎంత భారీ వ్యవస్థనో అర్థం చేసుకోవచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4680 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా, ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సామర్థ్యం (3916 మెగావాట్లు), కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థకు దాదాపు సమానం.

మరోవైపు కాళేశ్వరం పంపింగ్‌ సామర్థ్యం మరో టిఎంసీ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లింక్‌-1లోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపింగ్‌ కేంద్రాల్లో 15 మిషన్‌లను ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనిని ఎంఈఐఎల్‌ చేస్తోంది. వీటి సామర్థ్యం 600 మెగావాట్లు. జైలం, ఆండ్రిజ్‌ సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు కూడా అదనపు టిఎంసీ నీటి పనులను ప్రభుత్వం ఖరారు చేసే దశలో ఉంది.