పార్టీ చేసుకుంటూ కన్నా కోడలు మృతి

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. స్నేహితుల ఇంట్లో పార్టీ చేసుకుంటూ హఠాత్తుగా కుప్పకూలిపడిపోయి చనిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్రకు… నల్లపురెడ్డి సుహారికకు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సుహారికది నెల్లూరు జిల్లా. వీరికి ఇంకా పిల్లలు లేరు.

తన చెల్లి భర్త స్నేహితులు పార్టీ ఇస్తుండడంతో అక్కడికి సుహారిక వెళ్లారు. సుహారిక చెల్లెలు భర్త ప్రవీణ్ రెడ్డికి వివేక్, విహాస్, పవన్‌ రెడ్డిలు స్నేహితులు. పవన్‌ రెడ్డి గచ్చిబౌలిలోని ఇంట్లో గురువారం ఉదయం విందు ఇచ్చారు. ఈ పార్టీలో అందరూ కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఇలా డ్యాన్స్‌ వేస్తున్న సమయంలోనే సుహారిక స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. దాంతో చనిపోయినట్టు ధృవీకరించారు.

బీజీగా ఉండడంతో ఈ పార్టీకి సుహారిక భర్త ఫణీంద్ర హాజరుకాలేదు. ఉదయం 7.30 సమయంలో ఈ ఘటన జరగగా… సాయంత్రం 5.30కి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుహారిక మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని… ఆమె భర్త ఫణీంద్రతో పాటు ఆమె తల్లి కూడా పోలీసులకు చెప్పారు. ఎక్కువ సేపు డ్యాన్స్ చేయడం వల్లనే స్పృహ కోల్పోయి చనిపోయినట్టు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆమె చనిపోయి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.

మరణంపై ఎలాంటి అనుమానాలు లేవు అని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేయలేదు. కేవలం అంత ఉదయమే పార్టీ చేసుకుని డ్యాన్స్‌లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. పార్టీ జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

విషయం తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ… తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లారు.