బ్యూటీ టిప్స్ తో వీడియోలు చేస్తుందట…

హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉండాలి. ఏవైనా ఓపెనింగ్స్ తో బిజీగా ఉండాలి. అవకాశాల్లేకపోతే వెబ్ సిరీస్ లైనా చేయాలి. కానీ నభా నటేష్ మాత్రం విచిత్రంగా యూట్యూబ్ వీడియోలు చేస్తానంటోంది. అయితే అది కూడా ఫుల్ టైమ్ కాదు. పార్ట్ టైమ్ గా కొన్నాళ్లపాటు చేస్తానంటోంది. నభా నిర్ణయం వెనక ఓ రీజన్ ఉంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన నభా నటేష్.. తన అందాన్ని కాపాడుకునేందుకు ఇంటిచిట్కాల్ని పాటిస్తోంది. జుట్టు బాగా వత్తుగా పెరగడానికి, ముఖం మరింత ఆకర్షణీయంగా తయారవ్వడానికి, కాళ్ల పగుళ్లు నిరోధించడానికి, కళ్లకింద నలుపు పోవడానికి, లాక్ డౌన్ టైమ్ లో లావెక్కకుండా ఉండడానికి.. ఇలా ఒక్కో సమస్యకు ఒక్కో ఇంటి చిట్కా పాటిస్తోంది. అవన్నీ తనకు మంచి సత్ఫలితాల్ని ఇస్తున్నాయని చెబుతోంది.

దీంతో నభా నటేష్ కు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ లు ఎక్కువైపోయాయి. తమకు కూడా ఆ చిట్కాలు చెప్పమని చాలామంది అమ్మాయిలు నభాను అడుగుతున్నారు. అలాంటి వాళ్లందరి కోసం త్వరలోనే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు పెడతానంటోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. అదన్నమాట సంగతి.