రాశిఖన్నా తమిళ పాఠాలు

ఈ లాక్ డౌన్ టైమ్ ను పెర్ ఫెక్ట్ గా ఎవరైనా వినియోగించుకుంటున్నారంటే అది రాశిఖన్నా మాత్రమే. హీరోయిన్లంతా వంటింటికే పరిమితమై రకరకాల వంటలు చేస్తుంటే.. రాశిఖన్నా మాత్రం ఏకంగా గిటార్ నేర్చుకుంది. రీసెంట్ గా తన గిటార్ పై ఓ పాట కూడా పాడి పోస్ట్ చేసింది. ఇప్పుడు మరో కొత్త పని స్టార్ట్ చేసింది రాశిఖన్నా. ఏకంగా ఆన్ లైన్లో తమిళ పాఠాలు నేర్చుకుంటోంది.

అవును.. లీల అనే టీచర్ ను పెట్టుకుంది రాశిఖన్నా. ఆమె ద్వారా తమిళ్ నేర్చుకుంటోంది. ఆల్రెడీ రాశికి కొంచెం తమిళ్ టచ్ ఉంది. దాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటోంది. ఇప్పటికిప్పుడు రాశిఖన్నా ఇలా తమిళ పాఠాలు నేర్చుకోవడం వెనక ఓ రీజన్ ఉంది.

త్వరలోనే సూర్య సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది రాశి. హరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు వీలైతే తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనేది రాశిఖన్నా ఆశ. తెలుగులో ఆల్రెడీ డబ్బింగ్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. కుదిరితే తమిళ్ లో కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటోంది. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇలా తమిళ పాఠాలు నేర్చుకుంటోంది.