తండ్రి అయిన దర్శకుడు

దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. ఈరోజు ఆమె భార్య ఐశ్వర్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో, చెన్నైలో కరోనా జోరుగా వ్యాపిస్తున్న వేళ.. ఎన్నో ముందుజాగ్రత్తలు తీసుకొని ఐశ్వర్యకు డెలివరీ చేశారు వైద్యులు. ప్రస్తుతం తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నారని.. ఏఎల్ విజయ్ తమ్ముడు, నటుడు ఉదయ్ ప్రకటించాడు.

గతేడాది జులైలో ఐశ్వర్యను పెళ్లిచేసుకున్నాడు ఏఎల్ విజయ్. ఆమె చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అలా ఐశ్వర్య మెడలో 3 ముళ్లు వేసిన ఏఎల్ విజయ్.. ఏడాది తిరక్కుండానే తండ్రి అయ్యాడు.

ఏఎల్ విజయ్ కు ఇది రెండో పెళ్లి అనే విషయం అందరికీ తెలిసిందే. 2014లో విజయ్-అమలాపాల్ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. వాళ్లకు పిల్లలు కూడా పుట్టలేదు. అలా మూడేళ్ల కాపురం తర్వాత 2017లో ఇద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి సింగిల్ గా ఉన్న ఏఎల్ విజయ్, గతేడాది పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడు తండ్రి అయ్యాడు.

ప్రస్తుతం కంగనారనౌత్ తో తళైవ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా, పాన్ ఇండియన్ మూవీగా వస్తోంది ఈ సినిమా.