Telugu Global
National

హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ కూడా అనర్హుడే " ఏపీ ఏజీ శ్రీరాం

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా తిరిగి ఎస్‌ఈసీగా నియమితులైనట్టు ప్రకటించుకోవడాన్ని శ్రీరాం తప్పు పట్టారు. స్వీయ నియామం చేసుకునే అధికారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లేదన్నారు. నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు. […]

హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ కూడా అనర్హుడే  ఏపీ ఏజీ శ్రీరాం
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా తిరిగి ఎస్‌ఈసీగా నియమితులైనట్టు ప్రకటించుకోవడాన్ని శ్రీరాం తప్పు పట్టారు. స్వీయ నియామం చేసుకునే అధికారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం లేదన్నారు. నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు. కాబట్టి నిమ్మగడ్డకు స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదన్నారు.

హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆ రూల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కూడా వర్తిస్తుందన్నారు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ నియామకం కూడా చెల్లదన్నారు. ఎస్‌ఈసీ నియామకంలో గవర్నర్‌కు సలహా ఇచ్చే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, కేబినెట్‌కు గానీ లేదని హైకోర్టు చెబుతోందని… అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పదవికి అనర్హుడవుతారన్నారు.

2016లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫార్సు మేరకే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను గవర్నర్‌ ఎస్‌ఈసీగా ఎంపిక చేశారని… కాబట్టి నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదన్నారు.

ఈ గందరగోళం ఉంది కాబట్టే తాము ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఇందుకోసం పిటిషన్ కూడా వేశామన్నారు. ఎస్‌ఈసీని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు… ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మరోసారి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని… అదే సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు స్వీయ నియామకం చేసుకునే అధికారం కూడా ఉండదని శ్రీరాం వివరించారు.

తాను తిరిగి విధుల్లో చేరినట్టు ప్రకటించుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ సర్కులర్ కూడా పంపించారని… కానీ అది చెల్లదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభాకర్‌ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారన్నారు. ఆయనే ఈసీ తరపున కోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేశారన్నారు. రేపటిలోగా రాజీనామా చేయాల్సిందిగా ప్రభాకర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారన్నారు. ఫోన్ చేసి రాజీనామా చేయండి కొత్త రక్తాన్ని స్టాండింగ్ కౌన్సిల్‌లో నింపాలనుకుంటున్నానని రమేష్ కుమార్ ఆదేశించారన్నారు. కొంత సమయం ఇవ్వాల్సిందిగా ప్రభాకర్ కోరగా… సమయం ఇచ్చే ప్రసక్తే లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారన్నారు.

కానీ హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో ఎస్‌ఈసీని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పినందున ఈ గందరగోళానికి తెర దింపేందుకు సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరాం వివరించారు.

First Published:  30 May 2020 9:54 AM GMT
Next Story