జెర్సీ దర్శకుడితో చరణ్ సినిమా లేనట్లే….

ఎన్నో గాసిప్స్ టైపులో ఇది కూడా కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. జెర్సీ సినిమాను అద్భుతంగా తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ క్యూట్ రొమాంటిక్ స్టోరీ చేయబోతున్నాడనేది ఆ రూమర్ సారాంశం. మొన్నటివరకు సోషల్ మీడియాలో తిరిగిన ఈ పుకారుపై స్వయంగా గౌతమ్ తిన్ననూరి క్లారిటీ ఇచ్చాడు.

రామ్ చరణ్ తో తను సినిమా చేయడం లేదని స్పష్టంచేశాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం షాహిద్ కపూర్ తో తీస్తున్న జెర్సీ హిందీ రీమేక్ పైనే ఉందని, ఆ మూవీ పూర్తయిన తర్వాత నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు. గౌతమ్ ప్రకటనతో ఈ పుకారుకు ఫుల్ స్టాప్ పడింది.

నిజానికి చరణ్-గౌతమ్ తిన్ననూరి మధ్య కథాచర్చలు జరిగిన మాట వాస్తవం. చరణ్ తో ఓ ప్రేమకథను ఆయన తీయాలనుకున్న మాట కూడా నిజం. కానీ చరణ్ ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత కుదిరితే త్రివిక్రమ్ దర్శకత్వంలో లేదా కొరటాల దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఒకవేళ వీళ్లిద్దర్లో ఎవ్వరూ ఖాళీ లేకపోతే కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటాడు తప్ప గౌతమ్ తో మాత్రం సినిమా చేయడు.

ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలంటే మరో బడా దర్శకుడు కావాల్సిందే. అందుకే గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమా ఆగిపోయింది.