తెలంగాణలో ఒకే రోజు 169 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు అమాంతం భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలతో పరీక్షల సంఖ్యను పెంచారు. హైదరాబాద్ నగరంలో భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్ వెలుగు చూస్తోంది.

శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో ఏకంగా 169 కరోనా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నలుగురు చనిపోయారు. ఒక్కరోజే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ 169 కేసుల్లో వంద కేసులు తెలంగాణకు చెందిన వారే కాగా… సౌది నుంచి వచ్చిన మరో 64 మంది ఉన్నారు. దాంతో కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో 2వేల 425కు చేరింది.

ఇప్పటికే 1381 మంది డిశ్చార్జ్ కాగా… 973 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం నమోదైన 169 కేసుల్లో 82 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు కాగా… రంగారెడ్డి జిల్లాకు చెందిన 14 మంది ఉన్నారు. కొత్తగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు.