రైతులకు కేసీఆర్‌ చెప్పే గుడ్‌ న్యూస్‌ ఇదేనా !

ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో రైతులకు త్వరలోనే శుభవార్త ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌ అయింది. సీఎం కేసీఆర్‌ మరో కొత్త పథకానికి రూపకల్పన చేశారా? రైతులకు ఏం తీపి కబురు ఇవ్వబోతున్నారని రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చర్చ జరుగుతోంది.

సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చర్యలు చేపట్టారు. నియంత్రిత వ్యవసాయ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. వానాకాలం పంటల నుంచి పంటకాలనీలు ఏర్పాటు చేయబోతున్నారు.

రైతుకుపెట్టుబడి మొదలుకుని గిట్టుబాటు దాకా.. అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, విత్తన సబ్సిడీ, పంట కొనుగోలుకు మరికొన్నింటిని జోడించి వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తోంది.

రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఉచితంగా అందజేయడం మొదలు పెట్టుబడి సమకూర్చడం, గిట్టుబాటు ధరకు పంటల కొనుగోలు వరకు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.

వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త పథకానికి తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమయ్యే ఆర్థిక అవసరాలపై కూడా ఆయన ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు సమచారం.

నియంత్రిత పద్ధతిలో ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేస్తే ఈ పథకం అమలు చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంపై పూర్తి ప్రణాళిక తయారు చేసిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది.