బలమైన సందేశం ఇవ్వబోతున్న మహేష్

ఈరోజు మహేష్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశాడు మహేష్. తన కొత్త సినిమాకు సర్కారు వారి పాట అనే డిఫరెంట్ టైటిల్ ను పెట్టాడు. టైటిల్ మాత్రమే కాదు.. లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. సైడ్ ప్రొఫైల్ లో మహేష్ ను చూపించారు.

మరోవైపు ‘సర్కారు వారి పాట’ టైటిల్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. టైటిల్ బట్టి ఇదొక సీరియస్ మూవీ అయి ఉంటుందని చాలామంది చర్చించుకున్నారు. అయితే మహేష్ ఎక్కువ సస్పెన్స్ లో ఉంచలేదు. తన సినిమా జానర్ ను వెంటనే చెప్పేశాడు. సాయంత్రం ఫ్యాన్స్ తో ఛాట్ చేసిన మహేశ్.. సర్కారు వారి పాట సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బలమైన సందేశం ఉంటుందని ప్రకటించాడు. ఇప్పటివరకు తను టచ్ చేయని సబ్జెక్ట్ గా ఈ సినిమాను చెప్పుకొచ్చాడు.

మరోవైపు మూవీ రిలీజ్ డేట్ పై కూడా మహేష్ స్పందించాడు. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడే చెప్పలేమన్నాడు. పరిస్థితులన్నీ చక్కబడి, సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ పై ఓ ఐడియా వస్తుందంటున్నాడు.