మహేష్ ముందు దర్శకుడి మాట నెగ్గలేదు

పరశురామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గీతగోవిందం సినిమా. ఆ సినిమాకు అంత ఊపు రావడానికి కారణం సంగీత దర్శకుడు గోపీసుందర్. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అనే పాటతో ఓ ఊపు ఊపాడు గోపీసుందర్. ఆ ఒక్క పాటతో సినిమాకు విపరీతంగా ప్రచారం వచ్చింది. అదే ఊపు రిలీజైన తర్వాత కూడా కనిపించింది. ఫలితంగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు పరశురామ్.

ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే, తన కెరీర్ కు అంతలా కలిసొచ్చిన గోపీసుందర్ ను మహేష్ సినిమాకు కూడా రిపీట్ చేయాలనుకున్నాడు పరశురామ్. ఇదే విషయాన్ని మహేష్ కు చెప్పాడు. కానీ మహేష్ నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి కారణం తాజా సెన్సేషన్ తమన్.

అల వైకుంఠపురములో సినిమాతో తమన్ మేజిక్ చేశాడు. ఆ సినిమాలో ప్రతి పాట హిట్టయింది. సోషల్ మీడియాలో ఆ సాంగ్స్ కు ఇప్పటికీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అలా ఈ ఒక్క సినిమాతో కంపోజర్స్ లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు తమన్. అలాంటి తమన్ ను కాదని గోపీసుందర్ కు అవకాశం ఇవ్వడం మహేష్ కు ఇష్టంలేదు.

పైగా గతంలో తమన్ తో ఆగడు, బిజినెస్ మేన్, దూకుడు లాంటి సినిమాలు చేసిన అనుభవం మహేష్ కు ఉంది. కాబట్టి సంగీత దర్శకుడి విషయంలో మహేష్ మరో ఆలోచనకు తావివ్వకుండా తమన్ ను సెలక్ట్ చేశాడు. పరశురామ్ కూడా అందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది.