రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

ప్రేమ సంగతి బయటపెట్టాడు. రోకా ఫంక్షన్ కూడా పూర్తిచేశాడు. పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్. సరిగ్గా ఇక్కడే రానాకు తలనొప్పులు మొదలయ్యాయి. ఇన్ని విషయాలు చెప్పిన రానా, తన పెళ్లి ఎప్పుడనే విషయం చెప్పకపోవడంతో అంతా తమకు తోచినట్టు రాసుకుంటున్నారు. అయితే ఎక్కువమంది మాత్రం ఒకే తేదీకి ఫిక్స్ అయ్యారు. అదే ఆగస్ట్ 8.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 8న రానా-మిహీకాలు పెళ్లి చేసుకుంటారని సమాచారం. ఈ మేరకు పెద్దలు పెళ్లి తేదీని నిశ్చయించినట్టు చెబుతున్నారు. అంతా అనుకుంటున్నట్టు రానా పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు. హైదరాబాద్ లోనే బంధువులు, సినీప్రముఖులు, స్నేహితుల మధ్య ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని రానా భావిస్తున్నాడు.

అప్పటికి లాక్ డౌన్ నిబంధనలు పూర్తవ్వడంతో పాటు కరోనా ప్రభావం కూడా తగ్గుతుందని భావిస్తోంది దగ్గుబాటి కుటుంబం. అందుకే పెళ్లి తేదీని బయటకు చెప్పలేదు. జులై నాటికి కరోనా ప్రభావం ఎలా ఉందో చూసి, అప్పుడు పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోంది.

ఈమధ్య నిఖిల్, నితిన్ ఇలానే ఇబ్బందిపడ్డారు. పెళ్లి తేదీ ప్రకటించిన తర్వాత కరోనా వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదాలు వేసుకున్నారు. నిఖిల్ అయితే కొంచెం తెగించి, లాక్ డౌన్ టైమ్ లోనే గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు. నితిన్ మాత్రం మరో ముహూర్తం కోసం వెయిటింగ్. ఇలాంటి బాధల్లేకుండా ఉండడం కోసం పెళ్లి తేదీని బయటకు చెప్పడం లేదు రానా.