వకీల్ సాబ్… ఇంకా 35 రోజులు కావాలి

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు సెట్స్ పైకి వస్తానని పవన్ హామీ ఇచ్చారు. దీంతో మేకర్స్ తమ పనులు తిరిగి ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను పూర్తిచేయడానికి 35 పనిదినాలు అవసరం పడతాయట.

35 పనిదినాలంటే.. ప్యాచ్ వర్క్, వీకెండ్స్ తో కలుపుకొని దాదాపు నెలన్నర రోజులవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు కనీసం మరో నెల రోజులు పడుతుంది. సో… వకీల్ సాబ్ ఫస్ట్ కాపీ రెడీ అవ్వడానికి ఎంత కాదనుకున్నా రెండున్నర నెలలు పడుతుందన్నమాట.

ఈ సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నాడు దిల్ రాజు. ఓ వైపు థియేటర్లలో ఆంక్షలు ఉన్నప్పటికీ పవన్ సినిమా కాబట్టి రెవెన్యూ బాగానే వస్తుందని భావిస్తున్నాడు. అంతేకాదు.. పవన్ సినిమాను ముందు రిలీజ్ చేస్తే థియేటర్ల ట్రెండ్, జనాల మూడ్ ఎలా ఉందనే విషయంపై కూడా మిగతా మేకర్స్ కు ఓ అంచనా వస్తుంది. అందుకే అంతా వకీల్ సాబ్ కోసం వెయిటింగ్.