బాలయ్య పాట పాడుతున్నాడు

“ఇప్పుడో పాట ప్రయత్నిస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కువ సేపు వెయిట్ చేయించను. తొందర్లోనే సోషల్ మీడియాలోకి వదుల్తాను.”

ఇలా హాట్ హాట్ గా ఓ స్టేట్ మెంట్ వదిలారు బాలయ్య. అయితే దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నల్ని మాత్రం అలానే వదిలేశారు. ఇంతకీ బాలయ్య పాట ప్రాక్టీస్ చేయడమేంటి.. అది ఏ సినిమాలో పాట.. అసలు అది సినిమా పాటేనా లేక ఆధ్యాత్మిక గీతమా.. ఇలా ఫ్యాన్స్ లో ఎన్నో సందేహాలు. మరికొన్ని రోజుల్లో విడుదలకాబోయే సాంగ్ తో ఆ సందేహాలన్నింటికీ సమాధానాలిస్తామంటున్నాడు బాలయ్య.

పాటలు పాడడం బాలయ్యకు కొత్తకాదు. పైసా వసూల్ సినిమాలో “మామా.. ఏక్ పెగ్ లా” అనే పాట పాడింది ఈయనే. గతంలో స్టేజ్ పై బాలయ్య పాడిన సింహా సినిమాలో సాంగ్ చాన్నాళ్ల పాటు వైరల్ అయింది. ఇలా బాలయ్యకు గొంతు సవరించడంలో కాస్త అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఈసారి మరో పాట ప్రాక్టీస్ చేస్తున్నారు బాలయ్య.

ప్రస్తుతం ఈ హీరో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో తను అఘోరాగా కనిపించబోతున్నానని, తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు బాలయ్య.