కలచివేస్తున్న కడుపుతో ఉన్న ఏనుగు హత్య

కేరళలో ఒక ఏనుగు మృతి చెందిన తీరు కలచివేస్తోంది. ఏనుగు చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఏనుగు మృతి సంబంధించి అటవీ అధికారి చెప్పిన వివరాలు చూసిన తర్వాత చాలా మందికి మనసు కలచివేసింది.

కేరళలోని పలక్కడ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అప్పటికే కడుపుతో ఉన్న ఏనుగు ఆహారం కోసం దగ్గరిలోని గ్రామం వైపు వచ్చింది. దీన్ని గమనించిన కొందరు ఆకతాయిలు ఒక ఫైనాఫిల్ పండులో బాణాసంచా మందు కూర్చి ఏనుగు వద్ద వేసి వెళ్లారు. ఆహారం దొరికిందన్న ఆనందంతో ఏనుగు ఫైనాఫిల్‌ను తినేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఒక్కసారిగా బాణాసంచా మందు పేలింది.

పేలుడు ధాటికి ఏనుగు నోరు చీలిపోయింది. తీవ్ర రక్తస్రావం అయింది. ఆ నొప్పిని భరించలేక అరుస్తూ కొన్ని రోజుల పాటు ఆ గ్రామం సమీపంలోనే ఏనుగు తిరిగింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈనెల 25న ఏనుగు చనిపోయింది.

ఏనుగు చనిపోవడానికి రెండు రోజుల ముందు దాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అప్పటికే ఆ ఏనుగు నిస్సహాయంగా అడవిలోని నదిలో నిలబడి ఉండిపోయింది. నొప్పి నుంచి కాస్త ఉపశమనం కోసం ఏనుగు అలా నీటిలో ఉండిపోయినట్టు చెబుతున్నారు. అటవీ అధికారులు ఈ ఏనుగు ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగానే అది చనిపోయింది. పోస్టుమార్టంలో అది కడుపుతో ఉందని వైద్యులు తేల్చారు. ఆ ఏనుగు కడుపులోని ఏనుగు పిల్లను చూసి ఒక వైద్యుడు విలపించాడు.

ఏనుగు మరణం వివరాలు తెలుసుకున్న తర్వాత చాలా మంది దాని చావుకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఇలా పండ్లలో పేలుడు పదార్ధం నింపి వాటికి ఎరగా వేయడం అన్నది చాలా మంది చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఏనుగు చనిపోవడానికి కనీసం 15 రోజుల ముందే ఇలా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కడుపుతో ఉన్న ఏనుగు మృతిపై కొందరు కార్టూన్లు గీసి సంతాపం తెలుపుతున్నారు.