Telugu Global
NEWS

సీఎం చుట్టూ ముళ్ల కోటరి ఉంది... ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తోంది-వైసీపీ ఎంపీ

ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని సొంత ప్రభుత్వాన్నే హెచ్చరించారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇసుక వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు ఇటీవల ఇసుక విషయంలో విచిత్రమైన అనుభవం ఎదురైందన్నారు. చాలా ప్రముఖ డాక్టర్ ఒకరు ఫోన్ చేసి చిన్న సాయం కావాలని తనను అడిగారన్నారు. తప్పకుండా చేస్తానని తాను హామీ ఇవ్వగా… ఒక లారీ ఇసుక ఇప్పించాల్సిందిగా డాక్టర్ అడిగారని… దాంతో అంత పెద్దాయన లారీ ఇసుక […]

సీఎం చుట్టూ ముళ్ల కోటరి ఉంది... ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తోంది-వైసీపీ ఎంపీ
X

ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని సొంత ప్రభుత్వాన్నే హెచ్చరించారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇసుక వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు ఇటీవల ఇసుక విషయంలో విచిత్రమైన అనుభవం ఎదురైందన్నారు.

చాలా ప్రముఖ డాక్టర్ ఒకరు ఫోన్ చేసి చిన్న సాయం కావాలని తనను అడిగారన్నారు. తప్పకుండా చేస్తానని తాను హామీ ఇవ్వగా… ఒక లారీ ఇసుక ఇప్పించాల్సిందిగా డాక్టర్ అడిగారని… దాంతో అంత పెద్దాయన లారీ ఇసుక అడగడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. కానీ తాను ఆయన కోరినట్టు లారీ ఇసుకను సమకూర్చలేకపోయానని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

వైఎస్‌ హయాంలో యూనిట్‌ ఇసుక 500కు దొరికేదన్నారు. ఒక్క రూపాయి కూడా దాటింది లేదన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి హయాంలో యూనిట్‌ ధర రెండుమూడు వందలు పెరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో 2వేలకు యూనిట్‌ ఇసుక దొరికిందన్నారు. దానిపై అప్పట్లో ప్రజలు గగ్గోలు పెట్టారన్నారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకురావాలని జగన్‌మోహన్ రెడ్డి భావించారని చెప్పారు. కానీ పరిస్థితి చాలా అన్యాయంగా తయారైందన్నారు.

చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని… వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే ఇసుక కోసం ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఇసుక స్టాక్‌ పాయింట్లను చాలా దూరంగా పెడుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందిపడుతున్నారని… ప్రభుత్వానికి పెద్దగా వచ్చేది కూడా ఏమీ లేకుండాపోయిందని… మధ్యలో దళారులు తినేస్తున్నారని ఆరోపించారు.

ఇసుక సరఫరా అంతా సక్రమంగా ఉందని సీఎం అనుకుంటూ ఉండవచ్చని.. కానీ సామాన్యుల్లో చాలా వ్యతిరేకత, చెడ్డపేరు వస్తోందన్నారు. కాంట్రాక్టర్లకు అప్పగించి ఇంతకు మించి అమ్మకూడదు అని చెబితే పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. అలా కాకుండా అంతా మేమే చేస్తామని ముందుకెళ్లడం వల్లే పరిస్థితి ఇలా తయారైందన్నారు.

ఇసుక వల్ల ప్రజలు ఇంత ఇబ్బందిపడుతున్నారని సీఎంకు తెలియదనే తాను భావిస్తున్నానని చెప్పారు. కేవలం వెయ్యి కోట్ల ఆదాయం కోసం చూసుకుంటే రాజకీయంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని ఒక వైసీపీ నాయకుడిగానే ముఖ్యమంత్రికి తాను తెలియజేస్తున్నానన్నారు. వైఎస్‌ హయాంలో ని విధానాన్నే అమలు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.

ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ ఉందని వ్యాఖ్యానించారు. ఆ కోటరీ సీఎం దృష్టికి చాలా విషయాలను తీసుకెళ్లడం లేదన్నారు. సీఎం మల్లెపూవులాంటి వారని… చుట్టూ ముళ్ల కంచె ఉందన్నారు. ఆ ముళ్ల కంచె దాటుకుని సీఎం వరకు చాలా విషయాలు వెళ్లడం లేదని…. సీఎం వరకు ఎవరూ వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు రఘురామకృష్ణంరాజు.

First Published:  3 Jun 2020 12:27 AM GMT
Next Story