నరసాపురం ఎంపీపై స్టాండ్‌ తీసుకున్న వైసీపీ…

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే దిశగా పయనిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. కేంద్ర పెద్దలతో సంబంధాలున్నాయన్న ధైర్యంతో రఘురామకృష్ణంరాజు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. టీడీపీ టీవీ చానళ్లకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిలో వైసీపీ ప్రభుత్వానికి చికాకు కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారు రఘురామకృష్ణంరాజు.

దాంతో వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. రఘురామకృష్ణంరాజు చేసే వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వైసీపీ అధికార ప్రతినిధులకు ఆ పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.  వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి  స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

”నిన్న( మంగళవారం) సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ ఇంటర్నల్ మీటింగ్‌లో రఘురామకృష్ణంరాజు టాపిక్‌ కూడా చర్చకు వచ్చింది. పార్టీ ఎంపీగా ఉన్నందున ఆయన్ను గౌరవిస్తాం. కానీ ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకు పార్టీ అనుమతి లేదు. ఆయన చెప్పే ఏ మాట కూడా పార్టీ లైన్ కాదు. ఏబీఎన్, టీవీ5, మహాటీవీ, ఈటీవీ చర్చలకు వెళ్లవద్దు అని చెప్పినా… ఆయన వెళ్లి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా కావాలనే ప్రవర్తిస్తున్నారు. కావాలని ధిక్కరిస్తున్నారు. కోరి పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకోవాలనుకున్నారు. కాబట్టి ఆయన మాటలేవీ పార్టీ లైన్‌ కాదని చెప్పాల్సిందిగా అధికార ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై వైసీపీ అధికార ప్రతినిధులంతా ఇదే మాట చెబుతారు. మా పార్టీకి సంబంధించి ఏ అధికార ప్రతినిధిని అడిగినా ఇదే సమాధానం వస్తుంది ” అని రవిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.