Telugu Global
NEWS

అఖిలప్రియే సుపారీ ఇచ్చింది...

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ నాయుడే సుపారీ ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణలో కూడా ఈ విషయం తేలిందన్నారు. ఈ ఏడాది మార్చి 12న హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని ఆయన ఇంటి వద్దే హత్య చేసేందుకు సంజు అనే సూడో నక్సలైట్ ప్రయత్నించాడు. తెల్లవారుజామున ఒక్కడే ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలోకి చొరబడేందుకు […]

అఖిలప్రియే సుపారీ ఇచ్చింది...
X

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయించేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ నాయుడే సుపారీ ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల విచారణలో కూడా ఈ విషయం తేలిందన్నారు.

ఈ ఏడాది మార్చి 12న హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని ఆయన ఇంటి వద్దే హత్య చేసేందుకు సంజు అనే సూడో నక్సలైట్ ప్రయత్నించాడు. తెల్లవారుజామున ఒక్కడే ఏవీ సుబ్బారెడ్డి ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అంతలో అటువైపుగా హైదరాబాద్‌ పోలీసుల పెట్రోలింగ్ వెహికల్ రావడంతో సాధ్యం కాలేదు. ఒంటరిగా వెళ్లి హత్య చేయడం సాధ్యం కాదని నిర్దారించుకున్న సంజు… మార్చి 21న రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి అనే మరో ఇద్దరి సాయం తీసుకున్నాడు. మరోసారి హైదరాబాద్ వెళ్లి ఏవీ సుబ్బారెడ్డిని చంపేందుకు కడపలో వీరు ముగ్గురు స్కెచ్ వేస్తుండగా ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంజు ముఠాకు సుపారీ ఇచ్చింది భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ నాయుడే అని తేలింది. ఈ విషయాలను మీడియాకు వెల్లడించిన ఏవీ సుబ్బారెడ్డి… అఖిలప్రియ కుటుంబాన్ని తాము ఎంతో నమ్మామని… ఆమెను తన కుమార్తెతో పాటు చిన్నప్పుడు భుజాల మీద మోసానని… కానీ ఇప్పుడు తననే చంపేందుకు కుట్ర చేసిన దుర్మార్గురాలు అని ఆవేదన చెందారు.

ఈ కేసులో అఖిలప్రియను ఏ4గా, అఖిలప్రియ భర్త భార్గవ రామ్ నాయుడిని ఏ5గా చేర్చిన విషయాన్ని వివరించారు. ఇప్పటికీ అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్ట్ చేయకపోవడంపై సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు తొలుత సంజు కోటి రూపాయలు డిమాండ్ చేశాడని… చివరకు 50 లక్షలకు డీల్ మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించినట్టు ఆయన చెబుతున్నారు. సంజుతోపాటు తనను హత్య చేసేందుకు చేతులు కలిపిన రవిచంద్రారెడ్డి, రాంరెడ్డిలు భూమా అఖిలప్రియ అనుచరులేనని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుతం భార్గవ రామ్ నాయుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. భూమా నాగిరెడ్డి వెంట ఉండడమే కాకుండా కూతురు భూమా అఖిలప్రియను చూసుకున్నానని… ఇప్పుడు ఇలా దుర్మార్గంగా హత్య చేయించేందుకు ప్రయత్నించిన అఖిలప్రియపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడిని ఏవీ సుబ్బారెడ్డి కోరారు. ప్రస్తుతం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.

First Published:  4 Jun 2020 7:26 AM GMT
Next Story