రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు

  • వన్ నేషన్ – వన్ సిస్టమ్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కేంద్ర కేబినెట్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా వారు పండించిన పంటలు విక్రయించుకోవచ్చని.. స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరుస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

ప్రస్తుతం రాష్ట్రాల్లోనే ఒక ప్రాంతంలో పండిన పంటను వేరే ప్రాంతంలో అమ్ముకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కానీ, ఇకపై రాష్ట్రంలో గానీ, రాష్ట్రం వెలుపల గానీ ఎక్కడ ఎక్కువ ధర లభిస్తుందనుకుంటే రైతు అక్కడ అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.

రైతులు తమ పంటలను ఇష్టమున్న చోట్ల అమ్ముకోవడానికి వీలుగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీంతో పాటు వ్యవసాయ వాణిజ్యం, వ్యాపార చట్టానికి అవసరమైన సవరణలను కూడా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్సులను తేనున్నట్లు ఆయన చెప్పారు.

ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, పప్పు ధాన్యాలు, నూనె వంటి పలు రకాల ఆహార పదార్ధాలను నిత్యావసరాల చట్టం పరిధి నుంచి తొలిగిస్తున్నామని అన్నారు. దీంతో వారు ఆయా ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి వీలు కలుగుతుందని.. వాటిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని వివరించారు. ఇంతకాలం ఈ వస్తువులపై ఉన్న నియంత్రణను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ చట్టాన్ని కూడా సవరించనున్నట్లు తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు నోటిఫై చేసిన మార్కెట్లలో మాత్రమే రైతులు తమ పంటను అమ్ముకునే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వ చట్టం అమలులోనికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా తమ చట్టాలను సవరించుకోవాల్సి వస్తుంది. రైతులు నేరుగా రిటైలర్లు, అగ్రిగేటర్లు, ఇతర వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని విక్రయించుకోవడానికి అనుగుణంగా వాణిజ్య చట్టానికి సవరణలు చేసే ఆర్డినెన్సును తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఇవి చారిత్రక మార్పులు తీసుకొస్తాయని, రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరును కోల్‌కతా శ్యామ్‌ప్రసాద్ పోర్టు ట్రస్టుగా పేరు మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వశాఖ కింద ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిస్ అండ్ హోమియోపతిలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపైన ఇవి ఈ కమిషన్ కింద సబార్డినేట్ కార్యాలయంగా పనిచేయనున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కార్యదర్శుల స్థాయి సాధికారిక గ్రూపు (ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్), ప్రాజెక్టు డెవలప్‌మెంట్ సెల్స్ గ్రూపు ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.