కరోనా టెస్టుల విషయంలో చెత్త రికార్డు సృష్టించిన తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం పై మొదటి నుంచి టెస్టుల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర హైకోర్టు కూడా టెస్టుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం మారలేదని రికార్డులు చెబుతున్నాయి.

గత మే 26 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా ఎన్ని టెస్టులు జరిగాయో విశ్లేషణ జరపగా.. అత్యంత తక్కువ టెస్టులతో తెలంగాణ చెత్త రికార్డు సృష్టించింది. తెలంగాణలో కరోనా సోకే అవకాశాలు 20.2 శాతం ఉన్నట్లు కేంద్రం జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఢిల్లీ (25.7 శాతం) తర్వాత రెండో స్థానంలో ఉన్నది తెలంగాణ మాత్రమే.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం మే 26 నుంచి జూన్ 1 మధ్య 36వేల టెస్టులు చేసింది. వీటిలొ 9,600 కరోనా పాజిటివ్‌గా నిర్థారించబడ్డాయి.

ఇప్పటి వరకు ఢిల్లీలో 2.23 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించారు. మరోవైపు అదే సమయంలో తెలంగాణలో చేసిన టెస్టులు 4,300 మాత్రమే. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం 23,300 కరోనా టెస్టులు మాత్రమే నిర్వహించినట్లు covid19india.org అనే సంస్థ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం పదే పదే తెలంగాణ ప్రభుత్వాన్ని టెస్టుల విషయంలో హెచ్చరిస్తూనే ఉంది. ఎక్కువ టెస్టులు చేయడం ద్వారా ఏయే ప్రాంతాల్లో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నయో తెలుసుకోవచ్చని.. లేకపోతే ఒక్క సారిగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాగే నిర్లక్ష్యం చేయడంతో కేసులు పెరిగిన విషయం గుర్తు చేసింది.