ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా, ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా విజృంభన ఆగడం లేదు. దేశంలో గడిచిన 24 గంటల్లో 9వేల 304 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదు అవడం ఇదే ప్రథమం. మరణాలు కూడా ఒక్కరోజులో భారీగా నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో 260 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య దేశంలో 6వేలు దాటింది.

దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర 74వేల కేసులతో మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులో 27వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 23వేల, 645 కేసులు నమోదు అయ్యాయి.

గుజరాత్ 18వేల 100 కేసులతో నాలుగో స్థానంలో ఉంది. ముంబాయి కంటే ఢిల్లీలో కరోనా కేసులు ఇప్పుడు ఎక్కువగా నమోదు అవుతోంది. గడిచిన 24 గంటల్లోనే ఢిల్లీలో 1,513 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ముంబాయిలో 1276 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌కు కరోనా సోకడంతో ఆయనకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలోని మరో 35 మంది ఉన్నతాధికారులు క్వారంటైన్‌లో ఉన్నారు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో 480 మందికి కరోనా సోకింది. వారిలో 19 మంది వైద్యులు, 38 మంది నర్సులు, 74 మంది సెక్యూరిటీ గార్డులు, 75 మంది అటెండర్లు, 54 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.