కాఫీడే సిద్ధార్థ కొడుకుతో డీకే కూతురు పెళ్లి

కర్నాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కూతురు ఐశ్వర్య వివాహం కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ కుమారుడు అమర్త్య హెగ్డేతో జరుగబోతోంది. ఈ రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. గత ఏడాది ఈ పెళ్లి జరగాల్సి ఉంది. గత ఏడాది జూలైలో వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అప్పుడు బ్రేక్‌ పడింది.

గత ఏడాది జూలైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు వీజీ సిద్దార్ధ. ఆయన ఆత్మహత్య దేశ్యవ్యాప్తంగా సంచలనం రేపింది. సిద్దార్థ్‌ ఉన్నప్పుడే ఈ వివాహం గురించి ప్రస్తావన వచ్చిందని తెలిపారు డీకే శివకుమార్‌.

శివకుమార్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం తండ్రి వ్యాపారంలో కొనసాగుతున్నారు. వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకే శివకుమార్‌ కుటుంబసభ్యులు వెళ్లినట్టు తెలుస్తోంది.

జూలై 31 నాటికి సిద్దార్థ చనిపోయి ఏడాది పూర్తవుతుంది. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు శివకుమార్‌. సిద్ధార్థకు శివకుమార్‌ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది.

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడైన వీజీ సిద్ధార్థ 2019 జూలైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవికా చూసుకుంటున్నారు.