జీతాలు ఇవ్వని కంపెనీలపై చర్యలొద్దు – సుప్రీం కోర్టు

లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగులకు పూర్తి జీతం చెల్లించలేకపోయిన కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో కూడా కంపెనీలు పూర్తి జీతాలు చెల్లించాలని… ఉద్యోగులను తీసివేయవద్దని ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కంపెనీలు పూర్తి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్‌లకు మార్చి 29న కేంద్రం లేఖలు రాసింది. పూర్తి జీతం ఇవ్వకపోవడం నేరపూరితమనీ… వారిపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయల్ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

పనే జరగనప్పుడు జీతాలు పూర్తిగా ఇవ్వాలని ఒత్తిడి చేయడం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం సరైనది కాదని వాదించింది. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలపై, యాజమాన్యాలపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జూన్ 12 వరకు ఎలాంటి చర్యలు వద్దని స్పష్టం చేసింది.