పోలవరం కోసం ‘మేఘా’ ప్రత్యేక రైళ్లు

  • పోలవరం పూర్తి కావడానికి వినూత్న నిర్ణయం
  • వలస కార్మికులను తీసుకొని రావడానికి ప్రత్యేక రైళ్లు

ఏపీకి జలప్రధాయనిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) కంపెనీ చేపట్టిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు, కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లారు.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి కూడా 1200 మంది కార్మికులు గత నెలలో వెళ్లిపోయినట్లు ఏపీ సాగునీటి పారుదల శాఖ తెలిపింది. దీంతో మేఘా కంపెనీ అక్కడ పనులు అర్థాంతరంగా నిలిపివేయల్సి వచ్చింది.

అయితే పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా కంపెనీ దాదాపు వెయ్యి మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొని వచ్చింది. వచ్చే వారం మరో 1800 మందిని ప్రాజెక్టు పనులకు తీసుకొని రానున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. వారిని వెనక్కు రప్పించడమే కాకుండా వేతనాల పెంపు, ఇతర సదుపాయాలను మెరుగు పరిచామని తెలిపారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం కూడా కూలీలు లేక పలు ఇబ్బందులు పడుతోంది. వేలాది మంది కార్మికులు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో వారికి వేతనాలు పెంచడంతో పాటు విమానాల ద్వారా వెనక్కు తీసుకొని వస్తున్నారు.

ప్రెస్టీజ్ కంపెనీ 10 మంది కార్పెంటర్లను పాట్నా నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా వెనక్కు రప్పించినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

స్కిల్డ్ లేబర్ కొరత వల్ల ఎంత మొత్తమైనా చెల్లించి కార్మికులను తీసుకొని రావల్సిన పరిస్థితి ఏర్పడిందని వాళ్లు తెలిపారు.