ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

లాక్ డౌన్ తో థియేటర్లన్నీ మూసేయడం, రిలీజ్ లు ఆగిపోవడంతో ఓటీటీపై అందరి దృష్టి పడింది. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు భారీ రేటు పెట్టి సినిమా రైట్స్ కొంటున్నాయి. థియేటర్ కంటే ముందే ఆ సినిమాను ఓటీటీలో చూపించేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలోకి రాగా.. తాజాగా మరో సినిమా కూడా అందులో చేరేందుకు సిద్ధమౌతోంది.

సత్యదేవ్ హీరోగా నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను ఓటీటీకి ఇచ్చేందుకు నిర్ణయించింది నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. నిన్ననే ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ వచ్చింది. దీంతో బిజినెస్ పనుల్ని మరింత ఉధృతం చేశారు.

ఓటీటీకి సెన్సార్ అక్కర్లేదు. అదే సినిమాను టీవీల్లో ప్రసారం చేయాలంటే మాత్రం సెన్సార్ కావాలి. సో.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాకు సెన్సార్ పూర్తయింది కాబట్టి ఒకేసారి శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను అమ్మేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేనందున, ఒకవేళ తెరుచుకున్నా తమ సినిమాకు ఇప్పట్లో డేట్ దొరికే గ్యారెంటీ లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సినిమాకు ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి.