కుశుని ఆర్టికల్‌ కుట్రను చేధించిన టీటీడీ

టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన కుశుని కథ వెనుక కుట్ర ఉందని టీటీడీ తేల్చింది. కావాలని టీటీడీకి చెడ్డ పేరు తెచ్చే ఉద్దేశంతో… కొందరు ఉద్యోగులు ఈ కథనాన్ని కుట్రపూరితంగా ప్రచురించారని విజిలెన్స్‌లో తేలింది. ఇందుకు బాధ్యులను చేస్తూ పత్రిక చీఫ్ ఎడిటర్ రాధారమణ, సబ్ ఎడిటర్ పాల్గునను టీటీడీ సస్పెండ్ చేసింది.

2016లోనే రాధిక అనే మహిళ రామాయణంలో కుశుడు రాముడి కుమారుడు కాదని కొత్త కోణంలో ఆర్టికల్ రాసింది. అయితే దాన్ని అప్పట్లో చీఫ్ ఎడిటర్‌ తిరస్కరించారు. ఆ కథనాన్ని ఇప్పుడు కొందరు ఉద్యోగులు కుట్రపూరితంగా చిన్నచిన్న మార్పులు చేసి సప్తగిరి పత్రికలో అచ్చేశారు.

నారాయణ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి పేరున ఆర్టికల్‌ను ప్రచురించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ మాసపత్రికను బయటకు విడుదల చేయకుండా అడ్డుకుంది. కానీ కొందరు ఉద్యోగులు ఈ పత్రికను కొన్ని రాజకీయ పార్టీల నేతలకు అందజేశారు. దాంతో వారు రచ్చ మొదలుపెట్టారు.

రంగంలోకి దిగిన విజిలెన్స్ ఇదంతా కుట్రప్రకారమే జరిగిందని తేల్చారు. మరింత మంది పాత్రపై ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఆర్టికల్ పంపించారని చెబుతున్న విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులను ఈ అంశంపై విచారించారు. వారు అసలు తాము ఎలాంటి ఆర్టికల్ పంపలేదని చెప్పారు. కుట్రపూరితంగా ఒక వ్యక్తి బాలుడి ఫొటోను తీసుకుని వెళ్లినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. త్వరలోనే ఈ వ్యవహారంలో మరింత మంది పేర్లు వెల్లడించే అవకాశం ఉంది.