కరోనా అనుమానంతో గర్భవతిని చేర్చుకోని 8 ఆసుపత్రులు… అంబులెన్స్‌లో మృతి

కరోనా సోకిందేమోనన్న అనుమానంతో గర్భవతిని చేర్చుకోవడానికి 8 ఆసుపత్రులు తిరస్కరించడంతో.. సరైన సమయానికి వైద్యం అందక అంబులెన్స్‌లోనే మృతి చెందిన సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన విజేందర్ సింగ్, నీలమ్ భార్యభర్తలు. నీలమ్ 8 నెలల గర్భవతి. ఆమెకు పురిటి సంబంధిత సమస్యలు ఏర్పడటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చడానికి అంబులెన్స్‌లో తీసుకెళ్లాడు.

13 గంటల పాటు 8 ఆసుపత్రులు తిరిగినా.. కోవిడ్-19 అనే అనుమానంతో ఎవరూ చేర్చుకోలేదు. దీంతో సరైన సమయానికి ఆమెకు వైద్యం అందలేదు. తొలుత సెక్టర్ 30 ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి.. ఆ తర్వాత గ్రేటర్ నోయిడాలోని శారద ఆసుపత్రికి, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకొని వెళ్లాడు. వాళ్లు చేర్చుకోకపోవడంతో గౌతమ్ బుద్ద నగర్‌లోని జేపీ ఆసుపత్రి, ఫోర్టీస్ ఆసుపత్రుల్లో చేర్చడానికి తీసుకెళ్లాడు. వాళ్లు అడ్మిషన్ నిరాకరించడంతో ఘజియాబాద్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడు. దగ్గర్లోని చిన్న ఆసుపత్రుల్లో ప్రయత్నించినా ఎవరూ చేర్చుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరగా ఆమె అంబులెన్సులో మృతి చెందింది.

ఈ మొత్తం ఉదంతాన్ని వివరిస్తూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను సుమోటోగా స్వీకరించిన గౌతమ్ బుద్ద నగర్ జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై దీనిపై విచారణకు ఆదేశించారు. ఆసుపత్రులు పేషెంట్‌ను చేర్చుకోవడానికి ఎందుకు నిరాకరించాయో దర్యాప్తు చేశాలని ఆదేశించారు.